kodel siva prasad rao: స్పీకర్ కోడెలపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

  • స్పీకర్ రెండు రకాలుగా మాట్లాడుతున్నారు
  • కోడెల చర్యలు తీసుకోవడం లేదనే మేము కోర్టుకు వెళ్లాం
  • మాపై ఎదురు దాడి చేస్తున్నారు

ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యవహారశైలి చాలా దారుణంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుదారులపై చర్య తీసుకోవాలంటూ ఆయనను తాము కలసినప్పుడు ఒకలా మాట్లాడారని... తాము వచ్చేసిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టులో కేసు ఉందని, తాను ఎలా చర్యలు తీసుకోవాలి? అంటూ స్పీకర్ అంటున్నారని మండిపడ్డారు.

ఈ విషయంపై స్పీకర్ తనను తానే ప్రశ్నించుకోవాలని అన్నారు. తాము కోర్టుకు వెళ్లింది స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాదని... స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదనే బాధతో అని చెప్పారు. చట్టసభలను ప్రశ్నించే హక్కు కోర్టులకు లేదని గతంలో కోడెల అన్నారని తెలిపారు. ఇక అధికార పక్షం ఎదురు దాడి చేస్తూ దారుణంగా ప్రవర్తిస్తోందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన వ్యక్తులే, దాన్ని నాశనం చేస్తున్నారని చెప్పారు.

అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారంటూ తమపై నిందలు మోపుతున్నారని... తాము పారిపోలేదని, తమ అధినేత జగన్ ప్రజల్లోనే ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యల తీసుకుంటే, అసెంబ్లీకి రావడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. 

More Telugu News