ryan international school: మలుపు తిరిగిన ఢిల్లీ 'రేయాన్' స్కూలు విద్యార్థి హత్య కేసు.. సీనియర్ విద్యార్థిపైనే సీబీఐ అనుమానం!

  • తెరపైకి 11వ తరగతి విద్యార్థి పేరు
  • పరీక్ష వాయిదా వేయించేందుకు హత్య చేశాడని భావిస్తున్న సీబీఐ
  • కండక్టర్ కు కూడా క్లీన్ చిట్ ఇవ్వలేమన్న సీబీఐ

గుర్గావ్ లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమన్ ఠాకూర్ హత్య ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. స్కూలు బస్సుకు చెందిన కండక్టర్ అశోక్ కుమారే హత్యకు పాల్పడ్డాడని ఇప్పటిదాకా అందరూ భావించారు. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. పరీక్షలను, పేరెంట్స్ మీటింగ్ ను వాయిదా వేయించేందుకే ఓ సీనియర్ విద్యార్థి ఈ హత్యకు పాల్పడి ఉంటాడని సీబీఐ అనుమానిస్తోంది.

ఈ ఘటనకు సంబంధించి అదే స్కూల్లో చదువుతున్న 11వ తరగతికి చెందిన ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నామని సీబీఐ తెలిపింది. అతను చదువులో వెనుకబడ్డాడని... దీంతో, పరీక్షలు వాయిదా పడాలని అతను కోరుకున్నాడని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కారణంగానే ప్రద్యుమన్ ను హత్య చేసి ఉంటాడని తాము భావిస్తున్నామని చెప్పారు.

కేసులో ఈ విద్యార్థిని ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది. విచారణ కోసం సదరు విద్యార్థిని జువైనల్ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరుతోంది. మరోవైపు, కండక్టర్ కు ఇప్పటికిప్పుడే క్లీన్ చిట్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. అతనిపై వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతుందని తెలిపింది.  

More Telugu News