Donald Trump: వాళ్లకు పట్టిన గతే కిమ్ జాంగ్ కు పడుతుంది: ట్రంప్ వార్నింగ్

  • లిబియా, ఇరాక్ మాజీ అధ్యక్షులకు పట్టిన గతే కిమ్ కు పడుతుంది
  • కిమ్ పాలనను ఆ దేశ ప్రజలు ఇష్టపడటం లేదు
  • కిమ్ పిచ్చి చేష్టలను అమెరికా ఒంటరిగానే ఆపగలదు

అమెరికన్లను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తమతో పెట్టుకున్న ఇరాక్, లిబియా మాజీ అధినేతలకు ఎలాంటి గతి పట్టిందో అందరికీ తెలుసుకదా? అని హెచ్చరించారు. వారికి ఎలాంటి గతి పట్టిందో ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ కు కూడా అదే గతి పడుతుందని ట్రంప్ అన్నారు. వారు రూపొందిస్తున్న అణ్వాయుధాలు చివరకు వారికే హాని తలపెడతాయని చెప్పారు. దక్షిణ కొరియాలో పర్యటించిన ఆయన... సియోల్ లోని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఉత్తర కొరియాలో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే కిమ్ ఆటలు కట్టించాలని అన్నారు. దీనికోసం ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాలని చెప్పారు.

కిమ్ పాలనను ఉత్తర కొరియా ప్రజలు ఇష్టపడటం లేదని ట్రంప్ అన్నారు. అమెరికాను లక్ష్యంగా చేసుకుని కిమ్ అణ్వాయుధాలను రూపొందిస్తున్నారని... కిమ్ కు ఒకటే చెబుతున్నానని... అదేంటంటే, కిమ్ పిచ్చి చేష్టలను అమెరికా ఒంటరిగానే ఆపగలదు అని తెలిపారు. చైనా, రష్యాలు కిమ్ పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. మరోవైపు, దక్షిణ కొరియా పర్యటనను ముగించుకున్న ట్రంప్... చైనాకు బయల్దేరారు. 

More Telugu News