punjab national bank: కష్టాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్... 300 శాఖల మూసివేత!

  • మూసివేయడం కుదరకుంటే స్థానాలు మార్చుతాం
  • అంతకన్నా ముందు నష్టాల నుంచి లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నం
  • ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ముందడుగు
  • పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎండీ సునీల్ మెహతా

గత కొంతకాలంగా నిరర్థక ఆస్తుల శాతం పెరిగిపోయి, రీక్యాపిటలైజేషన్ కోసం అవస్థలు పడుతున్న ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు, వచ్చే ఏడాది లోగా నష్టాల్లో నడుస్తున్న 300 శాఖలను మూసివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ శాఖలను మూసివేయడం లేదా స్థానాలను మార్చడం చేయాలని నిర్ణయించినట్టు బ్యాంకు ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా వ్యాఖ్యానించారు.

నష్టాల్లోని శాఖలను లాభాల్లోకి నడిపించేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకోసం అభివృద్ధి, విస్తరణ వ్యూహాలను మార్చుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ రంగంలో పోటీ గణనీయంగా పెరిగిందని, తమ బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ నెట్ వర్క్ విస్తరణపై దృష్టిని సారించిందని తెలిపారు. మార్చి నాటికి 6,937 శాఖలుండగా, ఈ ఎనిమిది నెలల్లో 178 కొత్త శాఖలను ప్రారంభించామని సునీల్ మెహతా వెల్లడించారు.

బ్యాంకు లావాదేవీల్లో డిజిటల్ విధానానికి ప్రాధాన్యత పెరిగిందని, ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రస్తుతం 10 కోట్ల మంది కస్టమర్లు, 9,753 ఏటీఎంలు, 8,224 బీసీ అవుట్ లెట్లను తాము నిర్వహిస్తున్నామని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ కొత్త పాలసీల్లో నూతన శాఖల ఏర్పాటుపై బ్యాంకులకు మరిన్ని సౌలభ్యాలు ఉండటం తమకు అనుకూలమని అభిప్రాయపడ్డారు. నష్టాల్లో ఉన్న బ్యాంకు శాఖలను విలీనం చేసుకోవడం లేదా మూసివేయడం చేయవచ్చని, మరో ప్రాంతానికి తరలించేందుకైనా బ్యాంకుకు అధికారాలను కల్పిస్తూ, రిజర్వ్ బ్యాంకు నిర్ణయాన్ని ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.

More Telugu News