earth: ఆరు శతాబ్దాల్లో భూమి అగ్నిగోళం... మన కోసం మరో గ్రహాన్ని వెతుక్కోవాలి!: ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరిక

  • 600 సంవత్సరాల్లో అగ్నిగోళంగా మారనున్న భూమి
  • కారణాలు.. అధిక జనాభా, అధిక విద్యుత్ వినియోగం
  • సౌరకుటుంబం ఆవల ఆల్ఫా సెంటారీ నక్షత్ర సముదాయం
  • సెంటారీ నక్షత్ర సముదాయంలో భూమిని పోలిన గ్రహం

మరొక్క ఆరు శతాబ్దాల్లో భూమి అగ్నిగోళంలా మారుతుందని, ఈ లోగా మనిషి మనుగడకు కొత్త గ్రహాన్ని వెతుక్కోవాలని, లేని పక్షంలో మనిషి అంతరించిపోతాడని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ హెచ్చరించారు. బీజింగ్ లో జరుగుతున్న సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ, రానున్న 600 సంవత్సరాల్లో భూమి అగ్నిగోళంలా మారిపోతుందని చెప్పారు.

జనాభా నియంత్రణ లేకపోవడంతో పాటు విచ్చలవిడి విద్యుత్‌ వినియోగం దీనికి కారణమని ఆయన స్పష్టం చేశారు. తరువాతి తరాలు కొన్ని లక్షల ఏళ్లపాటు జీవించాలంటే మనిషి మరో గ్రహానికి వెళ్లడం తప్పదని ఆయన సూచించారు. మరోగ్రహం అంటే సౌరకుటుంబం అవతల భూమిని పోలి ఉన్న మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు. సౌరకుటుంబానికి చేరువలో ఆల్ఫా సెంటారీ అనే నక్షత్ర సముదాయం ఉందని, అందులో భూమిని పోలిన గ్రహం ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

 అక్కడికి వెళ్లాలంటే కాంతివేగంతో సమానంగా ప్రయాణించగల చిన్నపాటి ఎయిర్ క్రాఫ్ట్ ను రూపొందించాలని ఆయన సూచించారు. ఇందుకు అవసరమైన పరిశోధనల కోసం నిధులను అందించాలని ఇన్వెస్టర్లను ఆయన కోరారు. ఇన్వెస్టర్లు ముందుకు వస్తే రెండు దశాబ్దాల్లో కాంతివేగంతో సమానంగా ప్రయాణించే వాహనం తయారవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అలా తయారు చేసే వాహనం ద్వారా అంగారక గ్రహంపైకి అరగంటలోనూ, ప్లూటోపైకి కొన్ని రోజుల్లోనూ, ఆల్ఫా సెంటారీ నక్షత్రసముదాయంలోకి 20 ఏళ్లలోనూ చేరుకోవచ్చని ఆయన తెలిపారు. అక్కడ భూమిని పోలిన గ్రహం ఉండే అవకాశముందని అందులో నివాసం ఏర్పరచుకునే అవకాశాలను అన్వేషించాలని ఆయన సూచించారు. 

More Telugu News