peru: 'మిస్ పెరూ' అందాల పోటీల్లో చిత్రమైన శరీర కొలతలు చెప్పి ఆసక్తి రేపిన ముద్దుగుమ్మలు!

  • పెరూలో జరిగిన అందగత్తెల పోటీలు
  • మోడల్స్ పరిచయం సందర్భంగా ఆసక్తికర సంఘటన
  • శరీర కొలతల స్థానంలో మహిళలపై అకృత్యాలను ఏకరువుపెట్టిన అందగత్తెలు

మిస్ పెరూ అందాల పోటీల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అందాల పోటీల్లో అందగత్తెలు వచ్చి తమను తాము పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒక్కొక్క యువతి ముందుకు వచ్చి తమ పేరు, శరీర కొలతలు జడ్జిలకు చెప్పాల్సి ఉంటుంది. ఆ సమయంలో జడ్జిలు అంతకుముందే వారికి సంబంధించిన ప్రొఫైల్ ఫైల్ లో సరిచూసుకుని, వివిధ అంశాలను బేరీజు వేసి మార్కులిస్తుంటారు. ఇలా వివిధ దశల్లో పోటీ పడిన అనంతరం వారిలో ఒకరిని అందగత్తెగా ఎంపిక చేసి వారి తలపై కిరీటం పెట్టి అందగత్తె అంటూ ప్రకటిస్తారు.

 అయితే పెరూలో జరిగిన అందగత్తెల పోటీలో కంటెస్టెంట్స్ తమ పేరు చెప్పిన తరువాత శరీర కొలతలను చిత్రంగా చెప్పడంతో ఆసక్తి నెలకొంది. జడ్జిలతో పాటు వీక్షకుల ముందుకు వచ్చిన ఒక్కో అందగత్తె తమ పేరు, ఎక్కడి నుంచి కంటెస్టెంట్ చేస్తున్నామో ఆ ప్రాంతం పేరుతో పాటు ఆయా దేశాల్లో మహిళలపై జరిగిన లైంగిక దాడులు లేదా వేధింపులు లేదా హత్యల వివరాలను వెల్లడించారు.

లియాకు ప్రాతినిధ్యం వహించిన అందగత్తె.. వేదికపై క్యాట్ వాక్ చేసిన అనంతరం తనని తాను పరిచయం చేసుకుంటూ... ‘నా పేరు కేమిలా క్యానికోబా. నేను లిమాకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. నా శరీర సౌష్టవ కొలతలు 2,202. గడిచిన తొమ్మిదేళ్లలో నా దేశంలో నమోదైన లైంగిక వేధింపుల కేసులివి’ అంటూ ప్రారంభించింది.

ఆ తరువాత ఆమెను అనుసరించిన మరో అందగత్తె... ‘నా పేరు కరెన్‌ క్యూటో. నేను లిమాకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. నా కొలతలు ఈ ఏడాది జరిగిన 82 లింగవివక్ష హత్యలు, 156 హత్యాయత్నాలు’ అంటూ వల్లెవేసింది. దీంతో అందాల ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చివరగా అందగత్తెలంతా కలిసి మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు, హత్యలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. 

More Telugu News