song: చుట్టు ప‌క్క‌ల ప్లే అవుతున్న పాట‌ల‌ను గుర్తుప‌ట్టే గూగుల్ అసిస్టెంట్‌

  • కొత్త ఫీచ‌ర్‌ను అప్‌డేట్ చేసిన గూగుల్‌
  • పాట విని, వివ‌రాల‌ను అంద‌జేసే అసిస్టెంట్‌
  • ప్రాచుర్యం పొందిన పాట‌ల‌ను మాత్ర‌మే గుర్తిస్తుంది

ఏదైనా హోట‌ల్లో గానీ, కాఫీ షాప్‌లో గానీ కూర్చున్న‌పుడు అక్క‌డి స్పీక‌ర్ల‌లో మంచి పాట‌లు వ‌స్తుంటాయి. అయితే అవి ఏ సినిమాలోవో తెలియ‌దు. ప‌క్క‌నే ఉన్న ఫ్రెండ్స్ ని అడిగినా ఒక్కోసారి వారికి కూడా తెలియ‌దు. అలాంటి స‌మ‌యాల్లో స‌హాయ‌ప‌డేలా గూగుల్ అసిస్టెంట్ అప్‌డేట్ అయింది. అన్నిఆండ్రాయిడ్ ఫోన్ల‌కు ఇటీవ‌ల వ‌చ్చిన అప్‌డేట్‌లో భాగంగా గూగుల్ అసిస్టెంట్‌కి ఈ కొత్త ఫీచ‌ర్‌ను గూగుల్ అనుసంధానించింది.

దీని స‌హాయంతో చుట్టుప‌క్క‌ల ఏదైనా పాట ప్లే అవుతున్న‌పుడు, గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసి 'వాట్ సాంగ్ ఈజ్ దిస్‌?' అని గానీ, 'వాట్ సాంగ్ ఈజ్ ప్లేయింగ్‌?' అని అడిగి, పాట‌ను ఓ నిమిషం పాటు వినిపిస్తే చాలు... వెంట‌నే ఆ పాట వివ‌రాల‌ను, పాడిన వారి పేర్ల‌ను, పాట‌కు సంబంధించిన వీడియో లింకుల‌ను గూగుల్ అసిస్టెంట్ చూపిస్తుంది.

అయితే ప్ర‌స్తుతం పాపుల‌ర్ అయిన పాట‌ల‌ను మాత్ర‌మే గూగుల్ అసిస్టెంట్ గుర్తుప‌ట్ట‌గ‌లుగుతోంది. ఈ ఫీచ‌ర్ ప్ర‌యోగాత్మ‌కంగా కొన్ని దేశాల్లో మాత్ర‌మే అమ‌ల్లో ఉంది. భార‌త్‌లో ప్ర‌య‌త్నిస్తే `మీ దేశంలో ఈ సౌక‌ర్యం లేదు` అనే మెసేజ్ చూపిస్తోంది. ఇలా పాట‌ను గుర్తుప‌ట్టే స‌దుపాయాన్ని మొద‌ట‌గా షాజ‌మ్ అనే యాప్ ప్ర‌వేశ‌పెట్టింది. ఈ స‌దుపాయాన్ని ఐఫోన్ అసిస్టెంట్ సిరికి క‌ల్పించ‌డానికి 2014లో ఆపిల్ సంస్థ షాజ‌మ్‌తో ఒప్పందం చేసుకుంది.

More Telugu News