bse india: మార్కెట్ పై 'ప్యారడైజ్' దెబ్బ... లాభాల నుంచి నష్టాల్లోకి!

  • సెషన్ ఆరంభంలో లాభాలు
  • ఆపై నష్టాల్లోకి జారిన సూచికలు
  • 48 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
  • లాభాల్లో నడుస్తున్న ఐటీ కంపెనీలు

'ప్యారడైజ్ పేపర్స్' సృష్టించిన సంచలనం ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పై పడింది. ఈ ఉదయం సెషన్ ఆరంభంలో లాభాల్లో ఉన్న బెంచ్ మార్క్ సూచికలు, సమయం గడిచేకొద్దీ నష్టాల్లోకి జారిపోయాయి. ఒక దశలో సరికొత్త గరిష్ఠాలకు దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ, ప్రస్తుతం క్రితం ముగింపుతో పోలిస్తే నష్టాల్లో నడుస్తున్నాయి. ఈ మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 48 పాయింట్ల పతనంతో 22,683 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 16 పాయింట్లు పడిపోయి 10,436 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి.

మిడ్ క్యాప్ అర శాతం, స్మాల్ క్యాప్ 0.2 శాతం నష్టాల్లో నడుస్తున్నాయి. ఎన్ఎస్ఈలో హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, జడ్ఈఈఎల్ వంటి కంపెనీలు లాభాల్లో నడుస్తుండగా, ఐఓసీ, యస్ బ్యాంక్, రిలయన్స్, యూపీఎల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి. కాగా, ప్యారడైజ్ పత్రాల్లో దేశవ్యాప్తంగా బడాబాబుల పేర్లు వెల్లడికావడం, పలు దేశాధినేతల పేర్లు కూడా ఉండటంతో ఇన్వెస్టర్ల కొనుగోలు సెంటిమెంట్ తగ్గిందని, లాభాల స్వీకరణ అంశం తరెపైకి వచ్చిందని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News