t20: టీమిండియా-కివీస్ ఆఖరి పోరాటం నేడే!

  • 1988లో త్రివేండ్రంలో వన్డే నిర్వహణ
  • త్రివేండ్రం వన్డేకు కెప్టెన్ గా వ్యవహరించిన రవిశాస్త్రి
  • తిరువనంతపురంగా మారిన త్రివేండ్రం 
  • అంతర్జాతీయ టీ20కి ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం

కేరళ రాజధాని తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్-భారత్ సిరీస్ లో చిట్టచివరి టీ20 నేడు జరగనుంది. దాదాపు 30 ఏళ్ల క్రితం త్రివేండ్రం పేరుతో ఈ స్టేడియం వన్డే మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చింది. ఇన్నేళ్ల తరువాత తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంగా అంతర్జాతీయ టీ20కి ఆతిథ్యమివ్వనుంది. గతంలో అంటే 1988లో ఇదే నగరంలో జరిగిన మ్యాచ్ కు కెప్టెన్ గా రవిశాస్త్రి వ్యవహరించగా, అదే రవిశాస్త్రి నేడు టీమిండియా కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.

 కాగా, నిర్ణాయక టీ20లో విజయం కోసం రెండు జట్లు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఈ మ్యాచ్ కు సిరాజ్ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా ఓపెనర్లతో పాటు టాపార్డర్ అంతా ఫాంలో ఉండగా, కివీస్ టాప్ ప్లేయర్లు టచ్ లోకి వచ్చినట్టు కనిపిస్తోంది.

టీమిండియా బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉన్నప్పటికీ, న్యూజిలాండ్ బౌలింగ్ కూడా బలంగానే కనిపిస్తోంది. అయితే దుర్భేద్యమైన టీమిండియా బ్యాటింగ్ లైనప్ కారణంగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఇంకోవైపు వ్యూహాల్లో భాగంగా టీమిండియాను ముందుగా బ్యాటింగ్ చేయనిస్తే భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉందని, అది తమ బ్యాట్స్ మన్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని కివీస్ భావిస్తోంది. దీంతో టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ ను ఎంచుకునే అవకాశం ఉంది. కివీస్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగాలని భావిస్తోంది. స్టేడియం కొత్తది కావడంతో పిచ్ గురించిన ముందస్తు రిపోర్టులు ఏమీ లేవు. మ్యాచ్ లో వ్యూహాలతో దిగి అమలు చేయడమే విజయానికి చేయాల్సిందని రెండు జట్ల కెప్టెన్లు భావిస్తున్నారు. 

More Telugu News