smriti irani: నిర్మాతల బృందం తిర‌స్క‌రించినా ఏక్తా నాకు న‌టించే అవ‌కాశ‌మిచ్చింది: కేంద్ర‌ మంత్రి స్మృతీ ఇరానీ

  • ఒక‌ప్పుడు యాంక‌రింగ్ చేసిన కార్య‌క్ర‌మానికే అతిథిగా హాజ‌రు
  • రాజ‌కీయాల్లో గుర్తింపుకు టీవీ ప‌రిశ్ర‌మే కార‌ణ‌మ‌ని వ్యాఖ్య‌
  • ఇండియ‌న్ టెలివిజ‌న్ అకాడ‌మీ వేడుక‌ల్లో పాల్గొన్న కేంద్ర ప్ర‌సార శాఖ మంత్రి

సీరియ‌ల్‌లో న‌టించ‌డానికి అవ‌కాశం కోసం వెళ్లిన‌పుడు త‌మ నిర్మాత‌ల బృందం తిర‌స్కరించిన‌ప్ప‌టికీ నిర్మాత ఏక్తా క‌పూర్ త‌న‌కు న‌టించే అవ‌కాశం క‌ల్పించింద‌ని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. ముంబైలో ఆదివారం రాత్రి జ‌రిగిన ఇండియ‌న్ టెలివిజ‌న్ అకాడ‌మీ వేడుక‌ల్లో ఆమె పాల్గొన్నారు. ఈ వేడుక‌లో ఆమె మాట్లాడుతూ త‌న ఇండ‌స్ట్రీ జ్ఞాప‌కాల‌ను గుర్తుచేసుకున్నారు. 'దాదాపు 20 ఏళ్లు నేను టీవీ ప‌రిశ్ర‌మ‌తో మ‌మేక‌మై ఉన్నాను. నేను రాజ‌కీయాల్లో గుర్తింపు పొంద‌డానికి టీవీ ప‌రిశ్ర‌మే కార‌ణం. అందుకు నేను రుణ‌ప‌డి ఉన్నాను. బాలాజీ టెలీఫిలింస్ నిర్మాణ బృందం ఆడిష‌న్‌లో న‌న్ను తిర‌స్క‌రించిన‌ప్ప‌టికీ, ఏక్తా క‌పూర్ నాకు న‌టించే అవ‌కాశం ఇచ్చింది' అని ఆమె అన్నారు.

తాను 2007లో ఇదే కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించి, అప్ప‌టి స‌మాచార, ప్ర‌సార శాఖ మంత్రిని వేదిక మీదికి ఆహ్వానించాన‌ని, ఇవాళ అదే స్థానంలో తాను అతిథిగా వ‌చ్చినట్టు స్మృతీ వ్యాఖ్యానించారు. నిర్మాత ఏక్తా క‌పూర్ కూడా స్మృతీ ఇరానీతో త‌న‌కున్న సోద‌రిభావాన్ని ప్ర‌సంగంలో భాగంగా వెల్ల‌డించింది. అంతేకాకుండా వేడుక‌లో తాము క‌లిసి ఉన్న కొన్ని ఫొటోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏక్తా నిర్మించిన 'క్యోం కీ సాస్ భీ క‌బీ బ‌హూ థీ' సీరియ‌ల్‌లో తుల‌సి విరానీ పాత్ర ద్వారా స్మృతీ ఇరానీకి దేశ‌వ్యాప్త గుర్తింపు ల‌భించింది. ఈ సీరియ‌ల్ 1800కి పైగా ఎపిసోడ్లు ప్ర‌సార‌మైంది.

More Telugu News