Odisha: పేదోడి గోడు వినని ప్రభుత్వం.. టాయిలెట్‌ను గూడుగా మార్చుకున్న వైనం.. తిండీ, పడక అందులోనే!

  • ఇంటి కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన గిరిజనుడు
  • మరుగుదొడ్డినే ఇంటిగా మార్చుకున్న వైనం
  • మూడు నెలులుగా అందులోనే నివాసం

సంక్షేమ పథకాలు అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వాలు అర్హులకు వాటిని ఏమాత్రం అందిస్తున్నాయన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారుతోంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద సొంత ఇల్లు కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఓ రోజువారీ కూలీ విసిగి, వేసారి చివరికి ‘స్వచ్ఛ భారత్ యోజన’ కింద తనకు కేటాయించిన మరుగుదొడ్డినే ఇంటిగా మార్చుకున్నాడు. ఒడిశాలోని రూర్కెలాలో జరిగిందీ ఘటన.

జలద గ్రామానికి చెందిన గిరిజనుడైన చోటు రౌటియా (50) రోజు కూలీ. బీపీఎల్ కార్డు కూడా ఉంది. పీఎంఏవై కింద సొంతింటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు, స్థానిక నేతలు చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. ఫలితం లేకుండా పోయింది. అతడి విన్నపాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

నిజానికి రౌటియా తల్లిదండ్రులకు సొంతిల్లు ఉండేది. అయితే 1955లో రూర్కెలా స్టీల్ ప్లాంట్ కోసం ఇంటిని పోగొట్టుకున్నారు. రీసెటిల్‌మెంట్‌లో భాగంగా వారికి కట్టించిన ఇంట్లోనే రౌటియా ఉంటున్నాడు. తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితమే మరణించారు. ఇటీవల అతడు ఉంటున్న ఇంటి పైకప్పు పాడైపోయి, గోడలు బీటలువారాయి. దీంతో అది నివాసానికి పనికిరాకుండా పోయింది.

దీంతో పీఎంఏవై కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రజల చుట్టూ చేసిన ప్రదక్షిణలు ఫలితం ఇవ్వలేదు. అయితే అతడి దుస్థితి చూసిన ఇద్దరు అధికారులు ఇంటి విషయంలో తామేం చేయలేమంటూనే మరుగుదొడ్డిని మాత్రం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వారి సహకారంతో టాయిలెట్ నిర్మాణం పూర్తయింది.

అయితే, తనకి ఇల్లు లేకపోవడంతో మూడు నెలలుగా రౌటియా దానినే నివాసంగా మార్చుకున్నాడు. ఎండ, వాన, చలి నుంచి ఇప్పుడతడిని రక్షిస్తున్నది అదే. వాతావరణం బాగున్న రోజున బయట పడుకుంటానని, లేని రోజుల్లో లోపల నిద్ర పోతానని చెప్పే రౌటియా ప్రకృతి పిలిచినప్పుడు మాత్రం బయటకే వెళ్తానని చెప్పడం విశేషం. మొత్తాన్ని ‘స్వచ్ఛ టాయిలెట్’ కాస్త ‘స్వచ్ఛ ఇంటి’గా మారిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

More Telugu News