america: అమెరికాలో దుండగుడి వీరంగం... చర్చిలో ప్రార్థనలే లక్ష్యం.. భక్తులపై తూటాల వర్షం.. 28 మంది మృతి!

  • అమెరికాలో మరో ఉన్మాది కాల్పులు
  • చర్చిలో చొరబడి కాల్పులు
  • 28 మంది మృతి, 24 మందికి గాయాలు

అమెరికాలో మరో ఉన్మాది విరుచుకుపడ్డాడు. చర్చిలో ప్రార్థనల్ని లక్ష్యంగా చేసుకున్న దుండగుడు భక్తులపై తుపాకి తూటాలతో విరుచుకుపడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని టెక్సాస్ లో సదర్ ల్యాండ్ స్పింగ్స్ లోని బాప్టిస్ట్ చర్చ్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. చర్చిలో 50 నుంచి 60 మంది గుమికూడి ప్రార్థనలు చేస్తున్న సమయంలో డెవిన్ కెల్లీ అనే దుర్మార్గుడు అందులోకి అడుగుపెట్టాడు. వారిని లక్ష్యంగా చేసుకుని, తుపాకి తూటాలతో విరుచుకుపడ్డాడు.

తుపాకిని పలుమార్లు లోడ్ చేస్తూ కాల్పులు జరిపాడు. దీంతో చర్చిలో ప్రార్థనలు చేస్తున్నవారు హాహాకారాలు చేస్తూ తలోదిక్కుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తూటాలు తగిలి సుమారు 28 మంది నేలకూలారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా వుండడం కలచివేస్తోంది. ఈ ఘటనలో మరో 24 మందికి గాయాలయ్యాయి. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

కాల్పుల అనంతరం దుండగుడు వాహనంలో పారిపోతూ మరో వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో తన వాహనం నుంచి దిగిపోయి పారిపోయే ప్రయత్నంలో ఉండగా అతడిని పోలీసులు కాల్చిచంపేశారు. ఈ ఘటనపై ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్ నుంచే తాను పరిస్థితిని సమీక్షిస్తున్నానని తెలిపారు.

More Telugu News