saudi arabia: సౌదీ రాజు ఆదేశాలతో 11 మంది యువరాజుల అరెస్ట్

  • అవినీతికి పాల్పడ్డారన్న నివేదికపై రాజు కీలక నిర్ణయం
  • అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు
  • ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదన్న రాజు

సౌదీ అరేబియా రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతో 11 మంది యువరాజులు, నలుగురు మంత్రులు, డజన్ల కొద్దీ మాజీ మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, అవినీతి నిరోధక కమిటీని ఇటీవలే సల్మాన్ ఏర్పాటు చేశారు. అవినీతికి పాల్పడ్డవారి జాబితాతో ఆ కమిటీ రాజుకు నివేదికను ఇచ్చింది. అనంతరం అవినీతికి పాల్పడ్డ వీరందరినీ అరెస్ట్ చేయాలంటూ రాజు ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను అల్-అరేబియా టీవీ వెల్లడించింది.

దివంగత రాజు అబ్దుల్లా కుమారుడైన యువరాజు మితెబ్ ను అత్యంత శక్తిమంతమైన నేషనల్ గార్డ్స్ పదవి నుంచి సల్మాన్ తొలగించారు. అరెస్టైన వారిలో ప్రపంచ సంపన్నులలో ఒకరైన యువరాజు అల్వాలీద్ బిన్ తలాల్ కూడా ఉన్నారు. ఈయనకు సిటీ గ్రూప్, ట్విట్టర్ లో కూడా వాటాలున్నాయి. ఈ సందర్భంగా రాజు సల్మాన్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది.

"ప్రజా ధనాన్ని దోచుకున్నవారు, దాన్ని కాపాడలేకపోయినవారు, తమ పదవులను అక్రమాలకు వాడుకున్నవారు ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్షించబడతారు. చిన్నవారైనా, పెద్దవారైనా ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు" అంటూ సల్మాన్ స్పష్టం చేశారు. యువరాజు మితేబ్ స్థానంలో మరో యువరాజు ఖలీద్ అయ్యఫ్ ను నియమించారు. 

More Telugu News