gst: జీఎస్టీ వల్ల భార‌త ర్యాంకు మ‌రింత మెరుగుప‌డుతుంది: ప్ర‌ధాని మోదీ

  • ఇండియా బిజినెస్ రిఫార్మ్స్ కార్య‌క్ర‌మంలో మోదీ ప్ర‌సంగం
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకు గురించి ప్ర‌స్తావించిన ప్ర‌ధాని
  • జీఎస్టీకి ముందే 42 స్థానాలు మెరుగుప‌డింద‌ని వ్యాఖ్య‌

జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్ట‌క‌ముందే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగుల్లో భార‌త్ 42 స్థానాలు మెరుగుప‌డింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని ప్ర‌వాసి భార‌తీయ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇండియా బిజినెస్‌ రిఫార్మ్స్‌ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్ర‌పంచ‌బ్యాంకు విడుద‌ల చేసిన వ్యాపారానికి అనుకూల దేశాల జాబితాలో భారత్ ర్యాంకింగ్ గురించి ప్ర‌స్తావించారు.

గ‌డ‌చిన మూడేళ్లలో ఈ జాబితాలో భారత్‌ 42 స్థానాలు ముందుకెళ్లిందని ప్రధాని అన్నారు. ఆ 42 స్థానాలు కూడా జీఎస్టీ ప్ర‌వేశ‌పెట్ట‌క‌ముందు సాధించిన అభివృద్ధి అని, ఇక త్వ‌ర‌లో రానున్న జాబితాల్లో జీఎస్టీ అమ‌లు చేసిన కార‌ణంగా ర్యాంకు మ‌రింత మెరుగుప‌డుతుంద‌ని మోదీ వెల్ల‌డించారు.

ఇంకా ఈ ప్ర‌సంగంలో ఆయ‌న ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ గురించి కూడా ప్ర‌స్తావించారు. ఒకప్పుడు ప్రపంచబ్యాంకుతో కలిసి పనిచేసిన వారే ఇప్పుడు భారత ర్యాంకుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆయ‌న కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాను కనీసం ప్రపంచబ్యాంకు భవనాన్ని కూడా ఇంతవరకు చూడలేదని.. కానీ భారత్‌ సరైన మార్గంలోనే వెళ్తోందని నమ్ముతున్నానని మోదీ అన్నారు. త‌మ ప్ర‌భుత్వం మాదిరిగా గ‌త ప్ర‌భుత్వాలు ఆలోచించి ఉంటే దేశ ర్యాంకులు ఎప్పుడో బాగుప‌డి ఉండేవ‌ని ప‌రోక్షంగా కాంగ్రెస్‌కు చురకలంటించారు.

More Telugu News