సెక్స్ సీడీలతో నా పరువు తీసేందుకు బీజేపీ కుట్ర.. హార్ధిక్ పటేల్ సంచలన ఆరోపణ

04-11-2017 Sat 09:00
  • బీజేపీపై నిప్పులు చెరిగిన పటీదార్ ఉద్యమ నేత
  • ఎన్నికల ముందు మత కల్లోలాలు సృష్టించేందుకు ప్లాన్ చేస్తోందన్న హర్ధిక్ పటేల్
  • పనికిరాని వీవీపాట్ యంత్రాలు ఉపయోగించబోతోందని ఆరోపణ
బీజేపీపై పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ సంచలన ఆరోపణలు చేశాడు. గుజరాత్ ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీ కుయుక్తులు పన్నుతోందని పేర్కొన్నాడు. అందులో భాగంగా తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు నకిలీ సెక్స్ సీడీలు బయటపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. ‘‘సెక్స్ సీడీలను నా ఫొటోతో మార్ఫింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎన్నికలకు ముందు వాటిని బయటపెట్టే అవకాశం ఉంది. బీజేపీ నుంచి ఇంతకుమించి ఏం ఆశిస్తాం.. చూద్దాం ఏం జరుగుతుందో’’ అని హార్ధిక్ పటేల్ పేర్కొన్నాడు.

గుజరాత్ ఎన్నికల్లో లోపభూయిష్టమైన 3,555 ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపాట్) యంత్రాలను ఉపయోగించాలని చూస్తోందని హార్ధిక్ ఆరోపించాడు. ఇవన్నీ తొలి విడత పరీక్షల్లోనే విఫలమైనట్టు చెప్పాడు. ఎన్నికలకు ముందు బీజేపీ మత కల్లోలాలు సృష్టించేందుకు సిద్ధమవుతోందని హార్ధిక్ పటేల్ ఆరోపించాడు.

బీజేపీ సెక్స్ సీడీ బయటపెట్టేందుకు ప్లాన్ చేస్తోందన్న విషయం మీకెలా తెలుసన్న మీడియా ప్రశ్నకు ‘బీజేపీకి అది సాధారణ విషయం’ అంటూ ముక్తసరిగా జవాబిచ్చాడు. హర్ధిక్ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జితు వాఘాని ఖండించారు.