Supreme court: ఆధార్‌ విషయంలో ప్రజలను బెంబేలెత్తించవద్దు: సుప్రీంకోర్టు

  • ఆధార్ కార్డు అనుసంధానం నిబంధ‌న‌ల‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌
  • బ్యాంకులు, మొబైల్‌ కంపెనీల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • ఈ నెల చివ‌ర్లో ఆధార్‌ పిటిషన్లపై రాజ్యాం‍గ ధర్మాసనం ఎదుట తుది విచారణ
  • ఆధార్‌పై వ‌చ్చిన‌ పిటిషన్లపై స‌మాధానం చెప్పాల‌ని కేంద్ర స‌ర్కారుకి నోటీసులు

'మీ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసుకోండి, లేదంటే మీ ఖాతా నిలిచిపోయే అవ‌కాశం ఉంది' అంటూ ప్ర‌జ‌లకు బ్యాంకుల నుంచి మెసేజ్‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు 'కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు మీ ఆధార్ ను మొబైల్ నెంబ‌రుతో లింక్ చేసుకోవాల్సి ఉంది.. భ‌విష్య‌త్తులో మా సేవ‌ల‌ను నిరంత‌రాయంగా పొందాల‌నుకుంటే ఆధార్ అనుసంధానం చేసుకోండి' అంటూ టెలికాం కంపెనీలు కూడా విన‌యోగ‌దారుల‌ను భ‌య‌పెడుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు, మొబైల్‌ కంపెనీల తీరుపై స్పందించిన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధార్‌ విషయంలో ప్రజలను భ‌య‌పెట్ట‌వ‌ద్ద‌ని సూచించింది.

అన్నింటికీ ఆధార్ అనుసంధానం త‌ప్ప‌నిస‌రి అంటూ కేంద్ర ప్ర‌భుత్వం పెడుతోన్న నిబంధ‌న‌ల‌ను వ్య‌తిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్‌లు దాఖ‌లైన విష‌యం తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే, ఈ పిటిషన్లపై  స‌మాధానం చెప్పాల‌ని కేంద్ర స‌ర్కారుకి నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ నెల చివ‌ర్లో ఆధార్‌ పిటిషన్లపై రాజ్యాం‍గ ధర్మాసనం ఎదుట తుది విచారణ జరగనుంది.

More Telugu News