lakshmis veeragrandham: లక్ష్మీపార్వతి స్వగ్రామంలో పర్యటించిన 'లక్ష్మీస్ వీరగ్రంథం' డైరెక్టర్.. సమాచార సేకరణ!

  • లక్ష్మీపార్వతి స్వగ్రామం పచ్చలతాటిపర్రులో కేతిరెడ్డి పర్యటన
  • సినిమాను అడ్డుకోవడానికి లక్ష్మీపార్వతి యత్నిస్తున్నారన్న దర్శకుడు
  • ఈ నెల 12 నుంచి షూటింగ్

'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా నిర్మాణాన్ని అడ్డుకోవడానికి లక్ష్మీపార్వతి ప్రయత్నిస్తున్నారని చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని, ఏ శక్తీ ఈ చిత్ర నిర్మాణాన్ని అడ్డుకోలేదని ఆయన అన్నారు. సినిమా కోసం అవసరమైతే ఓపెన్ బ్యాలెట్ పెడతానని... 10 శాతం మంది ఆమెను దేవత అని చెప్పినా సినిమా నిర్మాణాన్ని ఆపి, ఆమెకు పాదాభివందనం చేస్తానని చెప్పారు. 12వ తేదీన సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని... వినుకొండ, పొన్నూరు ప్రాంతాల్లో ఎక్కువ భాగం షూటింగ్ చేస్తామని తెలిపారు.

ఈ సినిమా నిర్మాత విజయకుమార్ గౌడ్ తో కలసి కేతిరెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల క్రితం వినుకొండకు వెళ్లి, అక్కడ లక్ష్మీపార్వతి తొలి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు అప్పట్లో నిర్వహించిన వీరగంధం కళాకేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అప్పటి వివరాలను గ్రామ పెద్దలను అడిగి తెలుసుకున్నారు. అదే రోజు వీరగంధం స్వగ్రామమైన ప్రకాశం జిల్లాలోని భీమవరంలో కూడా వీరు పర్యటించారు. తాజాగా లక్ష్మీపార్వతి స్వగ్రామమైన గుంటూరు జిల్లా పచ్చలతాటిపర్రు, పొన్నూరు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతికి సంబంధించిన సమాచారాన్ని గ్రామంలోని వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. 

More Telugu News