iphone x: ఆవిష్క‌ర‌ణకు ముందే 300ల‌ ఐఫోన్ ఎక్స్ ఫోన్ల‌ను కొట్టేసిన దుండ‌గులు

  • ఆపిల్ స్టోర్‌లోనే దొంగ‌త‌నం
  • డెలివ‌రీకి సిద్ధంగా ఉన్న ఫోన్ల చోరీ
  • దాదాపు రూ. 2.40 కోట్ల విలువైన ఫోన్లు

ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌లు విడుద‌లవ‌గానే మార్కెట్‌లో హాట్‌కేకుల్లా అమ్ముడ‌వుతాయ‌నేది జగద్విదితం. ఆ విష‌యం తెలిసి కూడా ఆపిల్ సంస్థ వీటి ఉత్ప‌త్తికి ప‌రిమితులు విధించుకుంది. అందుకే ప్రీ సేల్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఫోన్ల స్టాక్ అవుతుంది. ఇక ఆఫ్‌లైన్‌లో కొనే వారు పెద్ద క్యూలో నిల‌బ‌డాల్సి వ‌స్తుంది. ఐఫోన్ ఎక్స్‌ను ద‌క్కించుకోవ‌డానికి ప్రీ సేల్‌, క్యూ లైన్ కాకుండా మ‌రోదారిని ఎంచుకున్నారు ముగ్గురు అమెరిక‌న్లు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆపిల్ స్టోర్‌లోనే దొంగ‌తనం చేసి 300 ఐఫోన్ ఎక్స్ ఫోన్లను కొట్టేశారు.

డెలివ‌రీకి సిద్ధంగా ఉన్న 313 ఆపిల్ ఐఫోన్ ఎక్స్ ఫోన్ల‌లో 300ల ఫోన్ల‌ను ఈ ముగ్గురు దొంగ‌లు స్టోర్ బ‌య‌ట పార్క్ చేసి ఉన్న డెలివ‌రీ వ్యాన్ నుంచి కొట్టేశారు. వీటి విలువ దాదాపు 3,70,000 డాల‌ర్ల విలువ (దాదాపు రూ. 2.40 కోట్లు) ఉంటుంద‌ని కంపెనీ చెబుతోంది. ఈ విష‌యమై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు డెలివ‌రీ సంస్థ యూపీఎస్ వెల్ల‌డించింది. 'ఆపిల్ ఐఫోన్ ఎక్స్' భార‌త్ స‌హా ప్ర‌పంచంలోని వివిధ దేశాల్లో ఇవాళ్టి నుంచి మార్కెట్లోకి రానుంది.

More Telugu News