UNO: భారత్ తో బంధాన్ని చైనా వద్దనుకుంటోంది...అందుకు సాక్ష్యం ఇదే: రక్షణ శాఖ

  • మసూద్ అజర్ కు మద్దతుగా నాలుగో సారి భారత్ ను అడ్డుకున్న చైనా
  • మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు మోకాలడ్డిన చైనా
  • చైనాపై మండిపడిన భారత రక్షణ రంగ నిపుణులు

పఠాన్ కోట్ దాడుల సూత్రధారి, నిషేధిత జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజర్‌ ను చైనా వెనుకేసుకురావడంపై భారత రక్షణ వర్గాలు అసహనం వ్యక్తం చేశాయి. ఐక్యరాజ్యసమితిలో చైనా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. మసూద్‌ అజర్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఇప్పటికి నాలుగు సార్లు భారత్‌ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించగా, ఈ నాలుగు సార్లు చైనా అతనికి అండగా నిలబడింది. భద్రతామండలిలోని 1267 నిషేధాల కమిటీ ముందు అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాలు మసూద్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైనా దానిని నాలుగోసారి అడ్డుకుంది.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రక్షణ శాఖ నిపుణులు పీకే సింగ్ మాట్లాడుతూ... యూఎన్వోలో చైనా ప్రవర్తించిన విధానం వల్ల, ఆ దేశంతో భారత్ బంధాలు ప్రమాదకరస్థాయిలోకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. సమితిలో తనకు ఉన్న వీటో అధికారాన్ని చైనా దుర్వినియోగం చేస్తోందని నిర్ధారణ అయిందని ఆయన పేర్కొన్నారు.

అంతే కాకుండా భారత్‌ తో బంధం అవసరం లేదని భావిస్తోందని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా ద్వంద్వ ప్రమాణాలకు ఇదే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదం విషయంలో చైనాది రెండు నాల్కల ధోరణి అని ఆయన మండిపడ్డారు. కాగా, మసూద్‌ అజర్‌ పై చైనా విదేశాంగ శాఖ కార్యదర్ధి హు చునియాంగ్‌ స్పందిస్తూ, అతనిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలున్నాయని, భారత్‌ చాలా అంశాలకు వివరణ ఇవ్వలేదని ఆరోపించారు.

More Telugu News