hardhik patel: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తున్నా: యువనేత హార్దిక్ పటేల్ కీలక ప్రకటన

  • పటేళ్లను ఓబీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్
  • రిజర్వేషన్ల కోటా అమలుకు యత్నిస్తామని చెప్పిన కాంగ్రెస్
  • సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటిస్తామన్న కాంగ్రెస్
  • ఆ వెంటనే మద్దతు ప్రకటించిన హార్దిక్ పటేల్

వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్టు పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్ కీలక ప్రకటన చేశారు. ఆయన కాంగ్రెస్ వైపు వెళతారని ముందు నుంచి ఊహిస్తున్న విషయమే అయినా, పటేల్ వర్గానికి రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన, హామీని కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే మద్దతిస్తామని హార్దిక్ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పటేళ్లకు ఇతర వెనుకబడిన తరగతులతో సమాన హోదాను కల్పించేందుకు కాంగ్రెస్ అంగీకరించడం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా 50 శాతం కోటాలోనే రిజర్వేషన్లను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ వెంటనే 24 ఏళ్ల యువనేత కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అన్నారు. ప్రజలు తెలివైన వారని, ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసునని అన్నారు. పటీదార్లకు టికెట్లు ఇచ్చామని చెబుతూ బీజేపీ మోసం చేసిందని హార్దిక్ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు బీజేపీని ఆదరిస్తుంటే, ప్రజల కనీస అవసరాలను తీర్చడంలోనూ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు.

More Telugu News