chandrababu: జోకులేస్తూనే ఒక్కో ఎమ్మెల్యేపై ఒక్కోలా చురకలు వేసిన చంద్రబాబు... ఏమన్నారో వింటే నవ్వాల్సిందే!

  • ఇంటింటికీ తెలుగుదేశంపై సమీక్ష
  • ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని పరిశీలించిన బాబు
  • నవ్విస్తూనే సునిశిత విమర్శలు చేసిన చంద్రబాబు
  • అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు

ఎమ్మెల్యేలు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారన్న విషయమై సమీక్షించిన చంద్రబాబు, తన వద్దకు వచ్చిన సమాచారాన్ని గురించి చెబుతూ ఒక్కొక్కరిపై ఒక్కోలా జోకులేస్తూనే చురకలు అంటించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీ తదితరులు తమ సొంత టెక్నాలజీని వాడుతున్నారని, ప్రభుత్వం ఇచ్చే టెక్నాలజీ పనిచేయడం లేదా? అని చమత్కరించారు.

ఇక తెనాలి ఎమ్మెల్యే ప్రస్తావనకు వచ్చిన వేళ, ఆయన ఎక్కడున్నాడని చంద్రబాబు ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లారన్న సమాధానాన్ని అధికారులు చెప్పగా, "అయితే అడిగానని చెప్పండి. క్షేమాన్ని అడగండి" అంటూ జోకేశారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే రామారావు విదేశీ పర్యటన గురించి, ఆ జిల్లా నేతలు చెప్పగా, మళ్లీ అదే శైలిలో 'ఆయనకు ఇంటర్నెట్ ద్వారా హలో చెప్పండి' అని అన్నారు.

గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అక్కడున్న అందరినీ నవ్వించాయి. "కుమారస్వామిలా కష్టపడి తిరగకుండా వినాయకుడిలా ఈశ్వరుడి చుట్టూ తిరిగితే చాలని అనుకుంటున్నావా?" అని ప్రశ్నించారు. దీంతో అవాక్కైన ఆయన బదులిస్తూ, అన్ని ఇళ్లకు వెళుతున్నానని, బయటి నియోజకవర్గాలు కూడా తిరుగుతున్నందున తన సొంత ప్రాంతంలో కాస్తంత ఆలస్యమైందని వివరణ ఇచ్చారు.

ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే డేవిడ్ రాజును చూసి, రోజుకు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారని చంద్రబాబు ప్రశ్నించగా, పది కిలోమీటర్లు తిరుగుతున్నానని ఆయన బదులిచ్చారు. "ఓ... అయితే మీ ఫిట్ నెస్ బాగుంటుంది" అని చంద్రబాబు కితాబిచ్చారు. సామాజిక మాధ్యమాలను అన్ని చోట్లా విస్తృతంగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఆలోచనలు, చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

More Telugu News