అంతర్జాతీయ ఉగ్రవాది లాడెన్ ఫైళ్లు బహిర్గతం!

02-11-2017 Thu 07:34
  • 4.7 లక్షల ఫైళ్లను బహిర్గతం చేసిన సీఐఏ
  • ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి
  • 2011లో లాడెన్‌ను హతమార్చిన అమెరికా
ఆల్ ఖాయిదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ఉగ్రవాది అయిన ఒసామా బిన్ లాడెన్‌కు చెందిన ఫైళ్లను అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) బయటపెట్టింది. పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో లాడెన్‌ను హతమార్చిన సీఐఏ అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో మరో 4.7 లక్షల ఫైళ్లను తాజాగా విడుదల చేసింది. సీఐఏ విడుదల చేసిన వాటిలో ఆల్ ఖాయిదాకు చెందిన లేఖలు, వీడియో, ఆడియో ఫైళ్లు, ఇతర వస్తువులు ఉన్నట్టు సీఐఏ డైరెక్టర్ మిక్ పోంపెయో తెలిపారు.

వీటిని బహిర్గతం చేయడం వల్ల ఉగ్రవాదుల ప్రణాళికలు తెలుసుకోవడానికి ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు వీటిని ఆన్‌లైన్‌ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. కాగా, 2011లో లాడెన్‌ను అబోటాబాద్‌లో ఆయన నివసిస్తున్న గృహంలోనే సీఐఏ హతమార్చిన సంగతి తెలిసిందే.