Rohit Sharma: రెచ్చిపోయిన భారత్ ఓపెనర్లు.. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం!

  • న్యూజిలాండ్ బౌలర్లను ఆటాడుకున్న రోహిత్, ధావన్
  • అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వైనం
  • ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. భారత ఓపెనర్ల వీర విహారంతో నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేసిన భారత్, ప్రత్యర్థి ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కివీస్ కుదేలైంది.

టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ ఇచ్చిన ఆతిథ్య జట్టు పెద్ద పొరపాటే చేసింది. ఆ తర్వాత రెండో ఓవర్‌లో ధావన్, ఏడో ఓవర్‌లో రోహిత్ శర్మలు ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేసిన న్యూజిలాండ్ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రోహిత్, ధావన్‌లు బంతులను ఎడాపెడా బౌండరీలకు తరలించి, స్కోరు బోర్డును ఉరకలెత్తించారు.

రోహిత్ శర్మ 55 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 80 పరుగులు చేయగా,  52 బంతులు ఎదుర్కొన్న శిఖర్ ధావన్ 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. హార్ధిక్ పాండ్యా డకౌట్ కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 26 (11 బంతుల్లో 3 సిక్సర్లు), ఎంఎస్ ధోనీ 7(2 బంతుల్లో ఒక సిక్సర్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో సోథీ రెండు, బౌల్ట్‌ ఓ వికెట్ పడగొట్టారు.

అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన కివీస్ ఏ దశలోనూ కోలుకున్నట్టు కనిపించలేదు. రెండో ఓవర్ మూడో బంతికే ఆరు పరుగుల వద్ద ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (4) వికెట్‌ను కోల్పోయింది. నాలుగో ఓవర్ నాలుగో బంతికి మరో ఓపెనర్ మున్రో (7)ను భువనేశ్వర్ పెవిలియన్ పంపాడు.

ఇలా 13 ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయిన కివీస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి బ్యాట్స్‌మెన్ వికెట్లు సమర్పించుకున్నారు. వికెట్ కీపర్ టామ్ లాథమ్ చేసిన 39 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. మిగతా వారిలో ఎవరూ 30 పరుగులు కూడా చేయలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసిన న్యూజిలాండ్ ఘోర పరాజయం పాలైంది.

టీమిండియా బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు. శిఖర్ ధావన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

More Telugu News