election commission: నేరం రుజువైన నేతలపై జీవితకాల నిషేధం విధించాలి: సుప్రీంకోర్టుకు తెలిపిన ఈసీ

  • ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలన్న ఈసీ
  • దీన్ని అమలు చేయలేమన్న కేంద్రం
  • అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం

రాజకీయ నేతలు నేరానికి పాల్పడినట్టు రుజువైతే... ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాల నిషేధం విధించాలంటూ ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదించింది. ఈ మేరకు ఈరోజు సుప్రీంకోర్టుకు నివేదించింది. గతంలో ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలైంది. సీనియర్ న్యాయవాది అశ్వని ఉపాధ్యాయ ఈ ప్రతిపాదనను పేర్కొంటూ, తొలి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ తర్వాత విచారణ సమయంలో తమ వాదనలు వినిపించేందుకు మరికొందరు చేరారు. అయితే ఈసీ నుంచి మాత్రం సరైన స్పందన రాలేదు.

దీంతో, జూలై 12న విచారణ సందర్భంగా ఈసీపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నేరం రుజువైన నేతలను జీవితకాలం నిషేధించే విషయంలో స్పష్టమైన వైఖరిని తెలియజేయడం లేదంటూ మండిపడింది. దీంతో, ఈరోజు తన వైఖరిని సుప్రీంకోర్టుకు ఈసీ తెలిపింది. నేరం రుజువైన నేతలను జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని చెప్పింది. మరోవైపు ఈ విచారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పిటిషనర్ విన్నపాన్ని అమలు చేయడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపింది. పిల్ ను తోసిపుచ్చాలని కోరింది. 

More Telugu News