vvs: వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఓ ర‌హ‌స్యం చెప్పిన స‌చిన్

  • ల‌క్ష్మ‌ణ్ ప‌రుగుల వెన‌క ర‌హ‌స్యం గురించి మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ ట్వీట్‌
  • ల‌క్ష్మ‌ణ్‌ బ్యాటింగ్‌కి వెళ్లేముందు స్నానం చేసి, యాపిల్ తింటాడ‌ట‌
  • త‌మ‌దైన శైలిలో విషెస్ చెప్పిన సెహ్వాగ్‌, ఇత‌ర క్రికెట‌ర్లు

భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ రోజు 43వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా క్రికెట‌ర్లు, అభిమానులు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. వాట‌న్నింటిలోకెల్లా ల‌క్ష్మ‌ణ్‌కి విషెస్ చెబుతూ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ పెట్టిన ట్వీట్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ల‌క్ష్మ‌ణ్‌కి సంబంధించిన ఓ డ్రెస్సింగ్ రూం ర‌హ‌స్యాన్ని స‌చిన్ బ‌య‌ట‌పెట్టాడు. ‘హ్యాపీ బర్త్‌డే లక్ష్! మైదానంలో నువ్వు పరుగులు సాధించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో బయటికి చెప్పేయనా? బ్యాటింగ్‌కు వెళ్లేముందు నువ్వు స్నానం చేసి యాపిల్‌ తింటావు.. అయ్యో..` అని స‌చిన్ ట్వీట్ చేశాడు.

అలాగే వీరేంద్ర సెహ్వాగ్ కూడా త‌న‌దైన శైలిలో ట్వీట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపాడు. అప్ప‌ట్లో లక్ష్మణ్‌ను ముద్దుగా మణికట్టు మాంత్రికుడు అని పిలిచేవాళ్లు. అందుకే సెహ్వాగ్, లక్ష్మణ్‌ చేతులను ‘రాయ్‌’ సినిమాలోని ‘చిటియాన్‌ కలైయాన్‌’ పాటతో పోల్చాడు. ‘రిస్ట్‌ జాదుగర్‌, భారత శ్రీ లక్ష్మణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎలాంటి సందర్భాన్ని అయినా సరే తన మణికట్టు మాయతో అనుగుణంగా మార్చేస్తాడు. చిటియాన్‌ కలైయాన్‌’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

ఇంకా సురేశ్‌ రైనా, రవిచంద్రన్‌ అశ్విన్‌, హర్భజన్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌ల‌తో పాటు ఐసీసీ, బీసీసీఐ సంస్థ‌లు కూడా ల‌క్ష్మ‌ణ్‌కి శుభాకాంక్ష‌లు తెలిపాయి. 1996లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన లక్ష్మణ్‌ అనతి కాలంలోనే ఎంతో పేరు సంపాదించి, 2012లో ఆడిలైట్‌లో జరిగిన టెస్టు అనంతరం క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

More Telugu News