Uttam Kumar Reddy: మేము అడుగుతోంది ఒక‌టి.. మీరు చెబుతోంది మ‌రొక‌టి!: అసెంబ్లీలో ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి

  • రైతుల‌పై ప‌డుతోన్న రుణాల వ‌డ్డీ భారాన్ని చెప్పాల‌ని అడిగాం
  • పోచారం శ్రీనివాస్ రెడ్డి మేము అడిగింది చెప్ప‌డం లేదు
  • ఇంత‌వ‌ర‌కు రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేదు

తెలంగాణ‌లో చేప‌ట్టిన భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న కార్య‌క్ర‌మం చారిత్రాత్మ‌క‌మైంద‌ని తెలంగాణ‌ అసెంబ్లీలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు  రైతు రుణ‌మాఫీ, క‌నీస మ‌ద్ద‌తుధ‌ర‌పై అసెంబ్లీలో చ‌ర్చ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పిన పోచారం శ్రీవివాస్ రెడ్డి మాట్లాడుతూ... తాము త‌ప్ప‌కుండా కోటి ఎక‌రాల‌కు నీరు ఇచ్చి తీరుతామ‌ని అన్నారు. రానున్న రోజుల్లో రైతులు ఎటువంటి ఇబ్బందులు ప‌డ‌కుండా చూసుకుంటామ‌ని చెప్పారు. అయితే, పోచారం మాట్లాడుతుండ‌గా క‌లుగ‌జేసుకున్న టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. తాము స‌భ‌లో లేవ‌నెత్తిన అంశం ఒక‌టైతే మంత్రి మ‌రో దానిపై వివ‌ర‌ణ ఇస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. తాము అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా వేరే అంశాలపై మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రుణ‌మాఫీ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌పై వ‌డ్డీ భారాన్ని ఎంత‌గా త‌గ్గించిందో చెప్పాల‌ని ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అన్నారు. వ‌డ్డీ భారాన్ని కూడా తామే భ‌రిస్తామ‌ని గ‌తంలో శాస‌న‌స‌భ‌లో సీఎం చెప్పార‌ని గుర్తు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌రూపాయ‌యినా ఆ భారాన్ని ప్ర‌భుత్వం భ‌రించిందా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం హామీ నిల‌బెట్టుకోలేద‌ని తేల్చి చెప్పారు. దీంతో స్పందించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఒక్కొక్క‌టిగా అన్ని విష‌యాల‌ను చెప్పుకుంటూ వ‌స్తున్నాన‌ని, అన్ని విష‌యాల‌ను ఒకే స‌మ‌యంలో చెప్ప‌లేం క‌దా? అని అన్నారు.

More Telugu News