raghuram rajan: ఫెడ్ రిజర్వ్ చీఫ్ పదవికి రఘురామ్ రాజన్ పేరును సూచించిన అంతర్జాతీయ పత్రిక!

  • ఫెడ్ రిజర్వ్ చైర్మన్ పదవికి రాజనే అర్హుడు
  • ఆర్థిక సంక్షోభాన్ని మూడేళ్ల ముందే గుర్తించిన ఘనత రాజన్ ది
  • రాజన్ పై ప్రశంసలు కురిపించిన బారన్స్ పత్రిక

అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ గా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్ని విధాలా సరైన వ్యక్తి అని అంతర్జాతీయ ఆర్థిక విషయాల పత్రిక 'బారన్స్' పేర్కొంది. ఈ పదవికి ముమ్మాటికీ రాజనే సరైన వ్యక్తి అని అభిప్రాయపడింది. భారత ఆర్థిక వ్యవస్థను రాజన్ సమర్థవంతంగా ఎలా చక్కబెట్టారో తన కథనంలో తెలిపింది.

ఫెడ్ రిజర్వ్ ప్రస్తుత చైర్ పర్సన్ జానెట్ ఎలెన్ వచ్చే ఏడాది ప్రారంభంలో రిటైర్ అవబోతున్నారు. దీంతో, కొత్త ఛైర్మన్ ను ఎంపిక చేసే పనిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. ఇప్పటికే కొంత మందితో కూడిన జాబితా ట్రంప్ కు చేరింది. ఆ జాబితాలో రాజన్ పేరు లేకపోయినప్పటికీ... రాజనే సరైన వ్యక్తి అంటూ 'బారన్స్' కథనాన్ని ప్రచురించడం గమనార్హం.

రాజన్ ఓ గొప్ప ఆర్థికవేత్త అంటూ బారన్స్ కొనియాడింది. భారత ఆర్థిక వ్యవస్థను రాజన్ కొత్త పుంతలు తొక్కించారని.... 2008 ఆర్థిక సంక్షోభాన్ని మూడేళ్ల ముందే రాజన్ ఊహించారని గుర్తు చేసింది. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ పదవికి ప్రస్తుత పరిస్థితుల్లో రాజన్ కు మించిన అర్హతలు కలిగిన వ్యక్తి మరొకరు లేరని తెలిపింది. రాజన్ ప్రస్తుతం 'షికాగో యూనివర్శిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్'లో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. 

More Telugu News