ips officer: ఐపీఎస్ గా ఉన్న కరీం, భార్యను కూడా భాగం చేస్తూ, ఇంత దిగజారడానికి అసలు కారణమిది!

  • ఐఏఎస్ కొట్టాలన్న ఆలోచనతో తప్పుడు దారి
  • జీవిత భాగస్వామిని కూడా ఇరికించిన కరీం
  • యాక్సిడెంట్ కావడంతో పోలీసు వ్యవస్థకు పనికిరానని నిర్ణయం
  • కూర్చుని చేసుకునే పని కావాలని ఐఏఎస్ పై ఆశ

భారత పోలీసు శాఖలో తాజా సంచలనంగా నిలిచిన వ్యక్తి సఫీర్ కరీం. ఐపీఎస్ అధికారిగా ఉంటూ, ఐఏఎస్ కొట్టాలన్న ఉద్దేశంతో తన భార్య జోయ్ ను తప్పుడు పనిలోకి దింపి అడ్డంగా దొరికిపోయి పరువు పోగొట్టుకుని ఊచలు లెక్కించాల్సిన స్థితిలోకి వచ్చిన వ్యక్తి. ఇక కరీం ఇంత తప్పుడు పనికి ఎందుకు దిగజారాడన్న విషయాన్ని పోలీసులు ఆయన నోటి నుంచే చెప్పించారు.

2015లో సివిల్స్ లో 112వ ర్యాంకు వచ్చినప్పటికీ, పోలీసు శాఖపై ఉన్న మక్కువతో ఐఏఎస్ ను వదులుకున్న కరీం ఐపీఎస్ వైపు వెళ్లాడు. మలయాళ సూపర్ హిట్ చిత్రం 'కమిషనర్'లోని హీరో పాత్ర కరీంకు ఆదర్శం. ఆపై కరీంకు ఓ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ తరువాత, తాను ఐపీఎస్ కు పనికిరానని, కూర్చుని చేసుకునే ఐఏఎస్ కు వెళ్లాలని భావించాడు.

అప్పటికి రెండు సార్లు సివిల్స్ పరీక్షలకు హాజరైనందున కరీంకు మరొక్క చాన్స్ మాత్రమే ఉంది. ఆ చాన్స్ పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో 'మున్నాభాయ్' అయిపోయాడు. తన భార్య ఉన్నత విద్యావంతురాలే కావడంతో, ఆమెకు ప్లాన్ చెప్పి ఒప్పించాడు. తిరునల్వేలి జిల్లా నంగునేరి సబ్ డివిజన్ ఏఎస్పీగా పని చేస్తూ, హైటెక్ మాస్ కాపీయింగ్ కు తెరతీసి పోలీసు శాఖ పరువు తీశాడు. తనను నమ్మి జీవితాన్ని పంచుకునేందుకు వచ్చిన భార్యనూ కటకటాల వెనక్కు నెట్టాడు. యాక్సిడెంట్ అయిన కారణంగానే ఐపీఎస్ బదులు ఐఏఎస్ కావాలని భావించినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. 

More Telugu News