delhi court: మగవాళ్ల కోసం పోరాడాల్సిన తరుణం వచ్చేసింది: ఢిల్లీ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

  • రక్షణ చట్టాలను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు
  • తప్పుడు ఆరోపణలకు మగవారు బలైపోతున్నారు
  • మగవారి కోసం మహిళా సంఘాలు పోరాడాలి

ఢిల్లీలోని ఓ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ అత్యాచార కేసు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి నివేదిత అనిల్ శర్మ మాట్లాడుతూ, మహిళల గౌరవం, ప్రతిష్ట కోసం పోరాటాలు చేసేవాళ్లు.... మగవారి విషయంలో ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మగవాళ్ల కోసం పారాడాల్సిన తరుణం వచ్చిందని అన్నారు.

వివరాల్లోకి వెళ్తే, 20 ఏళ్ల క్రితం నమోదైన ఓ అత్యాచార కేసులో నిందితుడు చివరకు నిర్దోషిగా తేలాడు. కోర్టు అతన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, అత్యాచార కేసుల్లో తప్పుడు ఆరోపణలు మగవారికి చాలా అన్యాయం చేస్తున్నాయని అన్నారు. తమకు రక్షణగా ఉన్న చట్టాలను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

కేసులో నిందితుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని బయటకు వచ్చినప్పటికీ... సమాజం దృష్టిలో అతను అత్యాచార ఆరోపితుడిగానే మిగిలిపోతాడని న్యాయమూర్తి అన్నారు. జీవితం కాలం ఈ అవమానాన్ని అతను భరించాల్సి ఉంటుందని చెప్పారు.

అత్యాచారం జరిగిందని తెలియగానే బాధితురాలికి అండగా నిలిచే ప్రజలు, మహిళా సంఘాలు... ముద్దాయి నిర్దోషి అని తేలిన తర్వాత అతనికి ఎందుకు మద్దతుగా నిలవడం లేదని ప్రశ్నించారు. మగవారి గౌరవ, మర్యాదలను కాపాడటానికి మహిళా సంఘాలు కూడా ముందుకు రావాలని సూచించారు.

కాగా, 1997 సెప్టెంబర్ 18న ఇంట్లో ఒంటరిగా ఉన్న తనను అపహరించి, అత్యాచారం చేశాడంటూ ఓ యువకుడిపై ఓ మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. అయితే, అత్యాచారం జరిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చివరికి తేలింది. ఆమెపై లైంగికదాడి జరగలేదని మెడికల్ నివేదికలు కూడా తేల్చాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానం అతడిని నిరపరాధిగా తేల్చింది. 

More Telugu News