Jayalalithaa: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన జయలలిత మేనకోడలు దీప!

  • త‌న భ‌ర్త మాధవన్‌తో గొడ‌వపడ్డ దీప
  • త‌న భార్య దీప డ్రైవ‌ర్ త‌న‌ను బెదిరించాడ‌ని మాధ‌వ‌న్ ఫిర్యాదు
  • దీప‌కు తోడుగా డ్రైవ‌ర్ రాజా కూడా జార్ఖండ్‌లోనే ఉన్న‌ట్లు అనుమానాలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త‌ జయలలిత మేనకోడలు దీప జ‌య‌కుమార్ క‌న‌ప‌డ‌కుండా పోయారు. గత శుక్ర‌వారం నుంచి ఆమె ఎక్క‌డున్నారో, ఏమి చేస్తున్నారో తెలియ‌క‌పోవ‌డంతో ఆమె మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. ఆమెతో పాటు ఆమె కారు డ్రైవర్ రాజా కూడా క‌న‌ప‌డ‌డంలేదు. దీపా జయకుమార్, ఆమె భర్త మాధవన్ ల మధ్య గొడ‌వ‌లు చెల‌రేగాయి. దీంతో  దీప భ‌ర్త‌ మాధవన్ కొన్ని నెలలు వేరుగా ఉండి, తిరిగి కొన్ని రోజుల క్రితం చెన్నైలోని టీనగర్ లో దీపా ఇంటికి వ‌చ్చారు.

మ‌రోవైపు దీప కారు డ్రైవర్ రాజా కూడా దీప‌ ఇంటికి వచ్చి వెళ్లడంతో మాధ‌వ‌న్.. ఆమెతో గొడ‌వ‌ప‌డ్డారు. అనంత‌రం తనను చంపేస్తానని రాజా బెదిరిస్తున్నాడని డ్రైవ‌ర్ రాజాపై మాధవన్ పోలీసు కేసు పెట్ట‌డంతో వారి మ‌ధ్య‌ విభేదాలు మ‌రింత చెల‌రేగాయి. దీంతో పోలీసులు రాజా మీద ఐపీసీ సెక్ష‌న్స్‌ 323, 506 (1) కింద కేసు నమోదు చేశారు. అయితే, గ‌త శుక్ర‌వారం టీ నగర్ పోలీస్ స్టేసన్ కు స్వ‌యంగా వ‌చ్చిన‌ దీప.. తన భర్త మాధవన్ త‌ప్పుడు ఫిర్యాదు ఇచ్చాడ‌ని తెలిపారు. అనంత‌రం దీప క‌న‌ప‌డ‌కుండా పోయారు.

డ్రైవ‌ర్‌ రాజా కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో అత‌డిని కూడా గాలిస్తోన్న‌ పోలీసులు.. రాజా మొబైల్ సిగ్నల్స్ జార్ఖండ్ లో ఉన్నాయని తెలుసుకున్నారు. అలాగే దీప జయకుమార్ జార్ఖండ్ నుంచి చెన్నైలోని ఓ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడారని పోలీసులు గుర్తించారు. దీప‌కు తోడుగా డ్రైవ‌ర్ రాజా కూడా జార్ఖండ్‌లోనే ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోయెస్ గార్డెన్ లోని జయలలితకు చెందిన వేదనిలయం ఆస్తి దీప కోసం మద్రాసు హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో ఆమెకు రాజ‌కీయ‌పరంగా కూడా ఒత్తిడి ఉంద‌ని కొంద‌రు భావిస్తున్నారు.  

More Telugu News