indian railways: కొత్త టైం టేబుల్ విడుదల చేసిన ఇండియన్ రైల్వేస్... 500 దూరప్రాంత రైళ్ల వేళల్లో మార్పు!

  • పావు గంట నుంచి రెండు గంటల ముందే గమ్యస్థానాలకు
  • ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ సూచన
  • గరిష్ఠంగా 130 కి.మీ. వేగంతో వెళ్లనున్న రైళ్లు 

'నీవు ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు' అన్న అపప్రథను తుడిచేసుకోవాలన్న ఉద్దేశం, నత్తనడకలో సాగుతాయన్న చెడ్డ పేరును పోగొట్టుకోవాలన్న కోరికతో, రేపటి నుంచి 500 దూరప్రాంత రైళ్ల వేగం పెంచాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయించింది. వీటికి సంబంధించిన కొత్త రైల్వే టైమ్ టేబుల్ ను విడుదల చేసింది. ఈ రైళ్లు బుధవారం నుంచి 15 నిమిషాల నుంచి రెండు గంటల ముందుగానే గమ్యస్థానాలను చేరుతాయని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరింది. ఈ రైళ్లలో రిజర్వేషన్లు చేయించుకున్న వారు విషయాన్ని గమనించాలని సూచించింది.

ఇక టైంటేబుల్ మారిన రైళ్లలో భోపాల్ - జోధ్ పూర్ ఎక్స్ ప్రెస్ (95 నిమిషాల ముందుగానే గమ్యస్థానానికి), గౌహతి - ఇండోర్ ఎక్స్ ప్రెస్ (115 నిమిషాల ముందుగా గమ్యస్థానానికి), ఘాజీపూర్ - బాంద్రా టర్మినస్ (95 నిమిషాల ముందుగా గమ్యస్థానానికి) తదితర రైళ్లు ఉన్నాయి. ఇక కొన్ని రైళ్లకు ఆదరణ తక్కువగా ఉన్న స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యాన్ని నిలిపివేశామని రైల్వే శాఖ పేర్కొంది.

చాలా రైళ్లు ఇకపై గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళతాయని తెలిపింది. కాగా, ఈ సంవత్సరం రైల్వేల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 1.31 లక్షల కోట్లను అంచనా వేయగా, ఇప్పటివరకూ రూ. 50 వేల కోట్లకు పైగా వెచ్చించారు. మరో ఏడాదిలో కాపలాలేని లెవల్ క్రాసింగ్ ఒక్కటి కూడా లేకుండా చూడాలన్న లక్ష్యంతో రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.

More Telugu News