BCCI: భారత క్రికెటర్ల పంట పండింది.. బ్రాడ్ కాస్ట్ హక్కుల్లో 26 శాతం రెవెన్యూ ఆటగాళ్లకే!

  • ప్రస్తుతం లభిస్తున్న 8 శాతం ఎకాఎకిన 26 శాతానికి పెరగనున్న వైనం
  • 26 శాతాన్ని మూడు విభాగాలుగా పంచనున్న బీసీసీఐ
  • స్టేడియం నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకూ కొంత

భారత క్రికెటర్ల పంట పండింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది. బ్రాడ్ కాస్టింగ్ హక్కుల్లో 26 శాతం రెవెన్యూను ఆటగాళ్లకు ఇవ్వాలని యోచిస్తోంది. బీసీసీఐ స్థూల ఆదాయంలో క్రికెటర్లకు 8 శాతం మాత్రమే వేతనాలు, బోనస్‌లుగా అందుతున్నట్టు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ (సీఓఏ) గుర్తించింది.

క్రికెటర్లకు 26 శాతం రెవెన్యూను ఇవ్వాలంటూ 2001లోనే బీసీసీఐ ప్రతిపాదించింది. 2004లో బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా సీనియర్ ఆటగాళ్లు  అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్‌లతో పలుమార్లు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. కాగా, ఆటగాళ్లకు ఇవ్వాలనుకున్న 26 శాతం రెవెన్యూ మూడు రకాలుగా ఉండనుంది. ఇందులో 13 శాతాన్ని అంతర్జాతీయ ఆటగాళ్లకు, 10.6 శాతాన్ని దేశీయ ఆటగాళ్లకు, మిగిలిన దానిని మహిళ క్రికెటర్లకు, జూనియర్లకు పంచనున్నారు.

బీసీసీఐ రాబడిలో 70 శాతాన్ని తన వద్దే ఉంచుకుని రాష్ట్రాల అసోసియేషన్లకు పంచుతుంది. 30 శాతంలో 26 శాతాన్ని ఆటగాళ్లకు ఇవ్వనుంది. మిగిలిన 4 శాతాన్ని స్టేడియం నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన, బోర్డు నిర్వహణ కోసం ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ రెవెన్యూలో ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కలపరు. ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా స్టేట్ అసోసియేషన్లకు పంచుతారు.

More Telugu News