David Miller: దక్షిణాఫ్రికా ఆటగాడు ప్రపంచ రికార్డు.. టీ 20ల్లో అతివేగవంతమైన శతకం నమోదు చేసిన డేవిడ్ మిల్లర్!

  • టీ20ల్లో తొలి సెంచరీతోనే రికార్డులకెక్కిన మిల్లర్
  • బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికి ఆరేసిన వైనం
  • రిచర్డ్ లెవీ రికార్డు బద్దలు

బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది టీ20లలో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. 2012లో దక్షిణాఫ్రికాకే చెందిన రిచర్డ్ లెవీ కివీస్‌పై 45 బంతుల్లో శతకం నమోదు చేసి నెలకొల్పిన రికార్డును మిల్లర్ తుడిచేశాడు. మొత్తం 36 బంతులు ఎదుర్కొన్న మిల్లర్ 7 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. టీ20లో మిల్లర్‌కు ఇది తొలి సెంచరీ కాగా, అది కూడా రికార్డు సెంచరీ కావడం గమనార్హం.

కాగా, ఇదే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా కూడా చెలరేగిపోయాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 85 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ బోల్తా పడింది. 18.3 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో విజయంతో రెండు టీ20ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో కైవసం చేసుకుంది.

More Telugu News