కార్యకర్తల సమావేశంలో రేవంత్ ఏం చెప్పారంటే..!

29-10-2017 Sun 14:19
  • కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి
  • కార్యకర్తలే తన అధిష్ఠానమన్న రేవంత్
  • కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రజలు ఏకం కావాలి
  • కార్యకర్తలను అడగకుండా ఏ నిర్ణయమూ తీసుకోబోనని వెల్లడి
నలుగురి చేతుల్లో ఉన్న కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉందని టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం నుంచి కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన, మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారిని ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తలు మాత్రమే తన అదిష్ఠానమని, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటానని హామీ ఇచ్చారు.

 "తెలంగాణ సమాజం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి వ్యతిరేకంగా, ఆ కుటుంబంలోని నలుగురి దోపిడీకి వ్యతిరేకంగా నాలుగు కోట్ల మంది ప్రజలు పునరేకీకరణ కావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ సమాజం వివిధ ముక్కలుగా విడిపోతే, కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది. ఈ కేసీఆర్ కు వ్యతిరేకంగా మన సమాజం పునరేకీకరణ జరగాలి. అందువల్లే ఈ రోజు ఇంత బాధ అయినా, ఇంత ఇబ్బంది అయినా నిర్ణయం తీసుకున్నాను. నేను మొన్న వచ్చినప్పుడే చెప్పినా. నా అధిష్ఠానం ఎక్కడో లేదు. నా అధిష్ఠానం కొడంగల్ కార్యకర్తలే. మీరు ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తా. మిమ్మల్ని అడగకుండా ఏ నిర్ణయం తీసుకోనని చెప్పినా" అని అన్నారు.