revant reddy: రేవంత్ వ్యవహారంలో టీడీపీ నేతలంతా గప్ చుప్.. మరి కారణం ఏమిటి!

  • తీవ్ర ఆరోపణలను పక్కనబెట్టిన నేతలు
  • నోరు మెదిపేందుకు సిద్ధంగా లేని లీడర్స్
  • అధినేత నుంచి సూచనలు అందడంతోనే సైలెన్స్

తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి రాజీనామా వ్యవహారం ఎంత సంచలనానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. దాదాపు పది రోజుల నాడు రేవంత్ ఢిల్లీ పర్యటనతో మొదలైన ఈ వివాదం, నిన్న టీడీపీకి ఆయన రాజీనామాతో సమసిపోయినా, ఇంకా వేడి మాత్రం తగ్గలేదు. ఢిల్లీ పర్యటన తరువాత, తన రాజీనామాకు ముందు రేవంత్ తెలుగుదేశం నేతలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలను టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

అదే సమయంలో రేవంత్ విమర్శలను అంతే గట్టిగా ఆ పార్టీ నేతలు తిప్పికొట్టారు. యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ వంటి వారు కేసీఆర్ తో స్నేహం పెట్టుకుని ఆయన్నుంచి కాంట్రాక్టులు పొందుతున్నారని రేవంత్ ఆరోపించగా, నిజామాబాద్ ఎంపీ కవితతో రేవంత్ కు వ్యాపార బంధముందని ఏపీ నేతలు ప్రత్యారోపణలు చేశారు. ఇక రేవంత్ రాజీనామా తరువాత, ఆయనపై మరిన్ని ఆరోపణలు చేస్తారని అందరూ భావించగా, ఆశ్చర్యపూర్వకంగా ఒక్కరు కూడా ఆరోపణలు చేయలేదు సరికదా... ఎవరూ నోరు మెదపడం లేదు. తమ పార్టీ అధినేత నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రేవంత్ ను విమర్శించడం లేదని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించడం గమనార్హం.

గతంలో ఇబ్బంది పెట్టిన ఓటుకు నోటు కేసు నుంచి పలు అంశాల్లో రేవంత్ తో గతంలో ఉన్న సంబంధాలు కొనసాగాల్సి వుండటంతో కాస్తంత మెతకగానే ఉండాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే రేవంత్ ను విమర్శించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. నిన్న అమరావతిలో చంద్రబాబుతో భేటీ అనంతరం రేవంత్ ను విమర్శించే ఉద్దేశం తమకు లేదన్నట్టుగా టీటీడీపీ నేతలు మీడియా ముందు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన్ను వ్యక్తిగతంగా విమర్శించబోమని పెద్దిరెడ్డి అన్నారు. ఆయన మంచి నేతని, అందువల్లే మద్దతిచ్చామని, ఆయన లేని లోటు తీరదని అనడం గమనార్హం. పలువురు నేతలు సైతం ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు.

More Telugu News