kiran bedi: తలుపులు మూశారు, తాళాలు లేవు... గోడదూకిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ!

  • తనిఖీల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లిన కిరణ్ బేడీ
  • మూసివున్న ప్రధాన గేట్ తలుపులు
  • తాళాలు పోయాయని అధికారుల సమాధానం
  • వెంటనే గోడదూకి లోనికి వెళ్లిన బేడీ

ఓ ఆసుపత్రిలో అత్యవసర తనిఖీ నిమిత్తం వెళ్లిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, గోడదూకాల్సి వచ్చింది. ఆసుపత్రి ప్రాంగణంలోని చుట్టూ గోడ నిర్మించివున్న 'లేడీ ఆఫ్ లౌర్డెస్' విగ్రహం వద్దకు ఆమె వెళ్లాలని భావించగా, గేటు తలుపులు మూసి ఉండటం, తాళాలు అందుబాటులో లేకపోవడంతో ఇటుకలతో నిర్మించిన గోడను ఎక్కి దూకారు. ఈ గోడ ఎత్తు సుమారు 3.5 అడుగుల ఎత్తు ఉంది. పుదుచ్చేరిలో భాగంగా ఉన్న కారైకల్ కాలనీకి ఐదు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కిరణ్ బేడీ, ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీయాలని భావించారు.

ఆసుపత్రి వద్దకు వచ్చిన ఆమె, విగ్రహం వద్దకు వెళ్లాలని చూశారు. ఆమె కోరిక తెలుసుకుని అధికారులు తాళాల కోసం లోనికి పరిగెత్తగా, తలుపులు తీస్తారని కాసేపు వేచి చూసిన ఆమెకు, తాళాలు పోగొట్టుకున్నామన్న సమాధానం వచ్చింది. ఇక మరొక్క క్షణం కూడా ఎదురుచూడకుండా గోడ దూకి కిరణ్ బేడీ వెళ్లారు. ఆమెతో పాటు అక్కడే ఉన్న కారైకల్ కలెక్టర్ ఆర్ కేశవన్, ఎస్పీ వీజే చంద్రన్, ఇతర అధికారులు కూడా మరో మార్గం కనిపించని స్థితిలో గోడ దూకేశారు. ఆపై ఆమె ఆసుపత్రిలో సమీక్ష నిర్వహించి, పరిసరాలు బాగాలేవని, దోమలు రాజ్యమేలుతున్నాయని చెబుతూ, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

More Telugu News