Hyderabad: మన మెట్రో ప్రత్యేకతలు ఇవే.. అడుగడుగునా అత్యాధునిక సాంకేతికత.. దేశంలో ఇదే తొలిసారి!

  • డ్రైవర్ లేకుండానే మెట్రో పరుగు
  • టికెట్ లేకుంటే లోపల అడుగు పెట్టడం కూడా అసాధ్యం
  • రైళ్ల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికత

దేశంలోనే అత్యద్భుత మెట్రోగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవం కోసం శరవేగంగా ముస్తాబవుతోంది. అత్యాధునిక  సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మెట్రో రైలు డ్రైవర్ లేకుండానే పరుగులు తీయనుంది. కంట్రోల్ రూము నుంచే దీనిని నియంత్రించనున్నారు. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (సీబీటీసీ) సాంకేతిక పరిజ్ఞానంతో రైళ్లు నడుస్తాయి. ప్రయాణికులను సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేర్చుతాయి. నగరంలోని 72 కిలోమీటర్ల పరిధిలో మూడు కారిడార్లలో 57 మెట్రో కోచ్‌ల నియంత్రణ మొత్తం ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ నుంచే జరుగుతుంది.

టికెట్ల విషయంలోనూ భాగ్యనగర మెట్రోకు ప్రత్యేకత ఉంది. టికెట్ లేకుండా లోపలికి ప్రవేశించే అవకాశమే ఉండదు. సిగ్నలింగ్ నుంచి రైలు నియంత్రణ, భద్రత వరకు అన్నింటా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. భద్రత కోసం ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ (ఏటీపీ)  వ్యవస్థ ఉంటుంది. రైలులో చిన్న పొరపాటు జరిగినా గుర్తించి అప్రమత్తం చేస్తుంది. రైళ్లు ఎంత వేగంతో వెళ్లాలి? స్టేషన్‌లో ఎంత సమయం ఆపాలి? అనేది ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ) నుంచే జరుగుతుంది. అత్యవసర సమయాల్లో రైళ్లను ఆపేందుకు ఎమర్జెన్సీ స్టాప్ ప్లంగర్స్‌ను ఏర్పాటు చేశారు.

ప్రతీ దృశ్యాన్ని రికార్డు చేసేందుకు ప్రతీ కోచ్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక టికెట్ తీసుకోకుండా మెట్రోలోకి ప్రవేశించే అవకాశమే లేకుండా ఎలక్ట్రానిక్ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. టికెట్ల కోసం ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేస్తున్నారు. టికెట్ తీసుకున్నాక దానిని ఎలక్ట్రానిక్ గేట్లపై పెడితేనే డోర్లు తెరుచుకుంటాయి. ఎగ్జిట్, ఎంట్రీలలో ఈ గేట్లు ఉంటాయి. మానవ వనరులను అతి తక్కువ స్థాయిలో వినియోగిస్తుండడం వల్ల తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

More Telugu News