రాష్ట్రాలు ఒప్పుకుంటే.. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ ను తీసుకురావడానికి సిద్ధం: అరుణ్ జైట్లీ

25-10-2017 Wed 16:44
  • రాష్ట్రాలు ఒప్పుకుంటే మేము సిద్ధమే
  • జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ వస్తే రాష్ట్రాల ఆదాయానికి భారీ గండి
  • ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలేనని చెప్పారు. ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు పెరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం... వ్యాట్ ను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే వ్యాట్ ను తగ్గించాయి. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ వస్తే... వాటి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీంతో, ఈ నిర్ణయం కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అయితే, ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఆదాయాన్ని కోల్పోతాయి. అందుకే, రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.