second odi: పిచ్ ను మార్చేస్తానన్న క్యూరేటర్.. స్టింగ్ ఆపరేషన్ లో బయటపడ్డ స్కామ్.. రెఫరీ ఓకే చెబితేనే నేటి వన్డే!

  • పిచ్ ను మార్చేస్తానన్న క్యూరేటర్
  • బ్యాటింగ్ పిచ్ ను తయారు చేస్తా
  • 340 పరుగులను కూడా ఛేజ్ చేయవచ్చు

భారత్, న్యూజిలాండ్ ల మధ్య నేడు జరగనున్న రెండో వన్డేకు పూణే ఆతిథ్యమిస్తోంది. అయితే, ఈ పిచ్ ట్యాంపర్ అయిందనే వార్తలు ఇప్పడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇండియా టుడే నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ విషయం బయటపడింది. పిచ్ క్యూరేటర్ పాండురంగ్ సల్గావోంకర్ క్రికెట్ బుకీల రూపంలో వచ్చిన రిపోర్టర్లతో మాట్లాడుతూ, పిచ్ ఎలా కావాలంటే అలా రెడీ చేస్తానంటూ అడ్డంగా బుక్కయ్యాడు.

ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రతినిధులు స్పందించారు. పిచ్ క్యూరేటర్ ను సస్పెండ్ చేశామని... రెండో వన్డే జరగాలో? లేదో? మ్యాచ్ రెఫరీ నిర్ణయిస్తారని తెలిపారు.

తాము దర్యాప్తును ప్రారంభించామని, ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభయ్ ఆప్టే తెలిపారు. బీసీసీఐ, ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా రిపోర్టర్లను సల్గావోంకర్ పిచ్ వద్దకు తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా "ఒకరిద్దరు ఆటగాళ్లు బౌన్సీ పిచ్ కావాలని కోరుతున్నారని, అది జరుగుతుందా?" అంటూ రిపోర్టర్లు క్యూరేటర్ ను అడగగా... 'సరే, పిచ్ ను అలాగే మారుస్తా' అంటూ సమాధానమిచ్చాడు. బ్యాటింగ్ కు సహకరించేలా పిచ్ ను తయారుచేస్తానని... 337 నుంచి 340 పరుగులు చేసే అవకాశం ఉందని... ఈ పరుగులను కూడా ఛేజ్ చేసే అవకాశం ఉందని చెప్పాడు.

More Telugu News