శశి: ప్రముఖ మలయాళ దర్శకుడు ఐ.వి. శశి కన్నుమూత

  • శశి మృతిపై కేరళ సీఎం, సినీ ప్రముఖులు సంతాపం
  • శశి గొప్ప టెక్నీషియన్ : కమల్
  • డైనమిక్ దర్శకుడు శశి: రాధిక

ప్రముఖ మలయాళ దర్శకుడు ఐ.వి.శశి (69) మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శశి, చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కాగా, శశి మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. శశి, సీమ దంపతులకు అను, అనీ ఇద్దరు పిల్లలు.

‘మలయాళ చిత్ర పరిశ్రమలో గొప్ప వ్యక్తి శశి అని, చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను ఎప్పుడూ గుర్తుంచుకుంటామని పినరయి విజయన్ అన్నారు. నలభై ఐదేళ్లుగా తన స్నేహితుడైన శశి గొప్ప టెక్నీషియన్ అని, ఆయన మృతిపై ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. తనకు సోదరి సమానురాలైన శశి సతీమణి, నటి సీమకు, మిగిలిన కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలుపుతున్నానని, వారికి తన ఆదరణ ఎల్లప్పుడూ ఉంటుందని ప్రముఖ నటుడు కమల హాసన్ పేర్కొన్నారు. సీనియర్ నటి రాధిక స్పందిస్తూ, డైనమిక్ దర్శకుడు శశితో కలిసి గతంలో పని చేశానని, ఆయన కుటుంబానికి తన సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. శశి మృతిపై సానుభూతి తెలిపిన వారిలో జయం రవి, పార్వతి నాయర్ తదితరులు ఉన్నారు.

కాగా, ఇరవై ఏడేళ్ల వయసులో దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని శశి ప్రారంభించారు. శశి దర్శకత్వంలో తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఉల్సవం’. ‘అనుభవం’, ‘1921’, ‘ఈట’, ‘మరిగయ’ తదితర చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ‘అవలుడే రావుక్కల్’ సినిమా సెట్ లో నటి సీమను శశి పెళ్లి చేసుకున్నారు.1982లో శశికి జాతీయ అవార్డు లభించింది. 2015లో జేసీ డేనియల్ అవార్డుతో శశిని కేరళ ప్రభుత్వం సత్కరించింది. 

More Telugu News