రాధేమా: నాపై ఆరోపణలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: రాధేమా

  • నాపై ఆరోపణలతో ఒత్తిడికి గురయ్యా
  • ఒకానొక దశలో సైకియాట్రిస్ట్ ను సంప్రదించా
  • ప్రజలను మోసం చేసేందుకు నేను సాధ్విగా మారలేదు
  • ఓ ఇంటర్వ్యూలో రాధేమా

వివాదాస్పద సాధ్వి రాధే మా తనపై వస్తున్న ఆరోపణలను తాను భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన గత జీవిత విషయాలను ప్రస్తావించారు. ‘నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. నా తండ్రి నిర్ణయం మేరకు పదిహేడేళ్ల ప్రాయంలోనే నా వివాహం జరిగింది. ఇరవై ఏళ్లకే ఇద్దరు పిల్లలకు తల్లిని అయ్యా. ఆ తర్వాత నా భర్త నన్ను వదిలేశాడు. నేను, మా అత్తగారు పరస్పరం ప్రేమగా ఉండేవాళ్లం. నా భర్త నన్ను వదిలేయడంతో పిల్లల బాధ్యత నాపై పడింది.

దీంతో, కుట్టుపని నేర్చుకున్నా. నాకు దేవుడిపై నమ్మకం ఉంది. నేను సాధ్విగా మారడానికి కారణం కూడా అదే. అంతేతప్పా, ప్రజలను దోచుకునేందుకని నేను సాధ్విగా మారలేదు. నేను రాజకీయవేత్తనో, దుర్గాదేవి అవతారాన్నో కాదు. నాకు మతం కంటే మానవత్వమే ముఖ్యం. నాపై వచ్చిన ఆరోపణలతో నేను చిత్రవధ అనుభవించా. ఆ ఒత్తిడిని భరించలేకపోవడంతో సైకియాట్రిస్ట్ ను కూడా సంప్రదించా. ఆరోపణల ఒత్తిడి భరించలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా’ అని రాధేమా చెప్పుకొచ్చారు.

More Telugu News