hizbul muzahiddeen: హిజ్బుల్ చీఫ్ సలావుద్దీన్ కుమారుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

  • ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల బట్వాడా
  • సిరియా నుంచి వచ్చిన డబ్బుతో ఉగ్రవాదం
  • 2011లో పెట్టిన కేసులో భాగంగా అరెస్ట్
  • మరో ఇద్దరి కోసం గాలిస్తున్న ఎన్ఐఏ

పాక్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కుమారుడిని ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) అరెస్ట్ చేసింది. సలావుద్దీన్ కుమారుడు సయ్యద్ షాహిద్ యూసఫ్ ఉగ్రవాదులకు నిధులందిస్తున్నాడన్న ఆరోపణలపై గట్టి సాక్ష్యాలు సేకరించిన తరువాత అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో శాంతి చర్చలను ప్రారంభించేందుకు ప్రత్యేక ప్రతినిధులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం వెల్లడించిన మరుసటి రోజే షాహిద్ యూసఫ్ ను అరెస్ట్ చేయడం గమనార్హం.

కాగా, 2011లో పెట్టిన కేసు విచారణలో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సిరియాకు చెందిన గులామ్ మొహమ్మద్ భట్ నుంచి డబ్బు యూసుఫ్ కు వచ్చిందని, దీని వెనుక సలాహుద్దీన్ ఉన్నాడని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. ఆ డబ్బును 2011 నుంచి 2014 వరకూ కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారని తెలిపారు. ఇదే కేసులో ప్రమేయమున్న మొహమ్మద్ మక్బూల్ పండిట్, అజీజ్ అహ్మద్ భట్ లు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

More Telugu News