italy: ఎలాంటి గాయం లేకుండా రక్తమోడుతున్న ఆ పేషంట్ ను చూసి డాక్టర్లు షాక్ తిన్నారు!

  • ఒత్తిడి కలిగితే శరీరంలోని అన్ని భాగాల నుంచి రక్తస్రావం
  • మూడేళ్లుగా సమస్యతో బాధపడుతున్న యువతి
  • రక్తంతో ఆసుపత్రికి వచ్చిన యవతిని చూసి వైద్యులు షాక్

అర్ధరాత్రి శరీరం మీద ఎలాంటి గాయాలు లేకుండా ముఖం నిండా రక్తంతో వచ్చిన యువతిని చూసిన వైద్యులు షాక్ తిన్నారు. ఏమైందని అడిగారు. మూడేళ్ల నుంచి తానీ బాధ భరించలేకపోతున్నానని ఆమె చెప్పడంతో మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరెన్స్‌ వైద్యులు కెనడియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌ లో తెలిపిన వివరాల ప్రకారం...ఇటలీలోని ఫ్లోరెన్స్ సిటీకి చెందిన 21 ఏళ్ల యువతి (వివరాలు సీక్రెట్) రక్తం కారుతోందని చెబుతూ, పురాతనమైన యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరెన్స్ వైద్యశాలకు వచ్చింది. ఆమె శరీరంపై చిన్నగాయం కూడా లేదు. అయితే ఆమె శరీరం నిండా రక్తం వుంది.

 దీనిని చూసిన యూనివర్సిటీ ప్రత్యేక వైద్యులంతా ఆశ్చర్యపోయారు. గత మూడేళ్లుగా తానీ సమస్యతో బాధపడుతున్నానని ఆమె తెలిపింది. కాసేపటికే ఆమె శరీరం నుంచి కారుతున్న రక్తం దానంతట అదే ఆగిపోయింది. ఇదెలా అని అడిగితే గాఢ నిద్రలో ఉన్నా, తీవ్ర ఒత్తిడికి గురైనా తన శరీరం నుంచి రక్తం కారడం మొదలవుతోందని ఆమె తెలిపింది. ఒత్తిడి తగ్గిన కాసేపటికే రక్తం కారడం ఆగిపోతోందని ఆమె తెలిపింది. దీంతో వెంటనే ఆమెకు యాంటీ యాంగ్జైటీ మందులు ఇచ్చారు. అయినప్పటికీ ఆమె శరీరం నుంచి రక్తస్రావం ఆగలేదు. దీంతో ఆమెకు మరిన్ని పరీక్షలు చేయగా... ఆమె 'హెమటోహైడ్రోసిస్‌' అనే వ్యాధితో బాధపడుతున్నట్టు నిర్ధారించారు.

 ఈ వ్యాధి ఉన్నవారు తీవ్రరక్తస్రావంతో బాధపడతారు. వీరికి స్వేద గ్రంధులు ఉత్తేజం చెందితే చెమటకు బదులుగా రక్తం స్రవిస్తుంది. గత 15 ఏళ్లలో ఈ వ్యాధితో బాధపడుతున్న కేసులు కేవలం 24 మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యాయని వారు వెల్లడించారు. ఆమె సమస్యకు అప్పటికప్పుడు కొన్ని మందులు ఉపయోగించి ఉపశమనం కలిగేట్లు చేశామని, అయితే ఆమె నుంచి ఆ సమస్యను పూర్తిగా నివారించలేకపోయామని మెడికల్ జర్నల్ లో వైద్యులు తెలిపారు. 

More Telugu News