national highway: బృహత్తర ప్రణాళిక కోసం రూ. 7 లక్షల కోట్లు సిద్ధం చేసిన మోదీ సర్కారు... నేడు కీలక ప్రకటన!

  • 2022 నాటికి 83 వేల కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి
  • 32 కోట్ల పనిదినాలను సృష్టించడమే లక్ష్యం
  • నేటి క్యాబినెట్ భేటీ తరువాత నిర్ణయం ప్రకటించనున్న మోదీ సర్కారు

దేశంలోని జాతీయ రహదారులను మరింతగా విస్తరించే ఆలోచనతో వచ్చే ఐదేళ్లలో రూ. 7 లక్షల కోట్లను వెచ్చించాలని భావిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం, అందుకు అవలంబించాల్సిన ప్రణాళికను నేడు ప్రకటించనుంది. మొత్తం 83 వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయాలని భావిస్తూ, ఈ పనుల ద్వారా 32 కోట్ల పనిదినాలను సృష్టించి ఉపాధి కొరత లేకుండా చూడాలన్న లక్ష్యంతో తీసుకోవాల్సిన చర్యలు, నిర్ణయాలపై నేడు క్యాబినెట్ సమావేశం తరువాత కీలక ప్రకటన వెలువడుతుందని సమాచారం.

సరిహద్దు ప్రాంతాలను కలుపుతూ అంతర్జాతీయ స్థాయిలో నౌకాశ్రయాల కనెక్టివిటీని పెంచే ఉద్దేశంలో భాగంగా రూపొందించిన 'భారత్ మాలా' హైవే ప్రాజెక్టు కూడా ఇందులో భాగంగానే ఉంటుందని తెలుస్తోంది. ఎక్స్ ప్రెస్ వేలకు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమర్షియల్ మరియు ఎకనామిక్ హబ్ ల నుంచి కూడా మెరుగైన రవాణా వసతులను కల్పిస్తామని, మరింత వేగంగా వాహనాలు కదిలేలా కొత్త రహదార్లు ఉంటాయని, గుర్తింపు పొందిన రెండు ప్రాంతాల మధ్య కనీసం నాలుగు లైన్ల రహదారులను నిర్మించాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలు చేస్తున్నామని కేంద్ర రహదారి మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. సరకు రవాణా వాహనాలు సైతం వేగంగా వెళ్లేందుకు అనుకూలంగా రోడ్లు ఉంటాయని తెలిపారు.

కాగా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఓ ట్రక్కు రోజుకు 700 నుంచి 800 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటే, ఇండియాలో మాత్రం ఈ సగటు 250 నుంచి 300 కిలోమీటర్ల మధ్యే ఉంది. కొత్త జాతీయ రహదారుల నిర్మాణంతో ప్రయాణదూరాన్ని రెట్టింపు చేయాలని మోదీ సర్కారు భావిస్తోంది. ప్రతి సంవత్సరం కనీసం 10 వేల కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారిని నిర్మించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని, వీటికి కావాల్సిన నిధుల కోసం పీఐబీ (పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు)ను ఏర్పాటు చేసి, దాని ద్వారానే నిధుల సమీకరణ, పంపిణీ చేపట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.

More Telugu News