delhi: కాలి వేళ్లు తీసి చేతికి అతికించారు.... ఢిల్లీలో అరుదైన చికిత్స!

  • ప‌దేళ్ల బాలుడికి చికిత్స చేసిన వైద్యులు
  • విజ‌య‌వంతం చేసిన స‌ఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వైద్యులు
  • ప‌ది గంట‌లు ప‌ట్టిన సంక్లిష్ట చికిత్స‌

రెండేళ్ల క్రితం ఎల‌క్ట్రిక్ హీట‌ర్ షాక్ కొట్టి తీవ్ర‌గాయాల పాలై ఒక చేయి, మ‌రో చేతి వేళ్ల‌ను కోల్పోయిన ప‌దేళ్ల బాలుడికి ఢిల్లీలోని స‌ఫ్దర్‌జంగ్ ఆసుప‌త్రి వైద్యులు చికిత్స చేశారు. బాలుడి కాలి వేళ్ల‌ను రెండింటిని తీసి వేళ్ల‌ను కోల్పోయిన చేతికి శ‌స్త్ర‌చికిత్స ద్వారా అతికించారు. చ‌త్తార్‌పూర్ ప్రాంతానికి చెందిన వీరేంద్ర సింగ్‌కి హీట‌ర్ షాక్ కొట్టింది. చేతుల‌తో పాటు ఛాతీ భాగం, క‌డుపు ప్రాంతంలో కూడా తీవ్రంగా కాలిన గాయాల‌య్యాయి. దాంతో అప్ప‌టి వ‌ర‌కు అల్ల‌రిగా తిరిగే వీరేంద్ర జీవితం ఒక్క‌సారిగా త‌ల‌కిందులైంద‌ని తండ్రి బీరేంద‌ర్ సింగ్ తెలిపాడు.

చ‌దువంటే చాలా ఇష్ట‌ప‌డే వీరేంద్ర రాసుకోవ‌డానికి వేళ్లు లేక‌పోవ‌డంతో చాలా సార్లు బాధ‌ప‌డ్డ‌ట్లు బీరేంద‌ర్ చెప్పాడు. ఎన్నో ఆసుప‌త్రులు తిరిగిన త‌ర్వాత చివ‌రికి స‌ఫ్దర్‌జంగ్ ఆసుప‌త్రి వైద్యులు శ‌స్త్ర‌చికిత్స చేయ‌డానికి ఒప్పుకున్నార‌ని అన్నాడు. ఆఖ‌రికి కాలి వేళ్ల‌ను తీసి చేతికి అతికించి వీరేంద్ర పెన్ను ప‌ట్టుకుని రాసేలా అమర్చార‌ని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం మూడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న త‌న కుమారుడు ఇక నోట్స్ రాసుకునే అవ‌కాశం క‌లగ‌నుంద‌ని ఆనందం వ్య‌క్తం చేశాడు.

ఈ సంక్లిష్ట చికిత్స చేయ‌డానికి దాదాపు 10 గంట‌లు ప‌ట్టింద‌ని డాక్ట‌ర్ రాకేశ్ కైన్ తెలిపారు. `ఈ చికిత్స‌లో ప్ర‌త్యేక అన‌స్థీషియా ఉప‌యోగించి, అతికించిన కాలి వేళ్ల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ అందేలా ర‌క్త‌నాళాల‌ను అమ‌ర్చాల్సి ఉంటుంది. చికిత్స ప్రారంభానికి ముందు వీరేంద్ర మెడిక‌ల్ రిపోర్ట్‌ల‌న్నీ క్షుణ్ణంగా చ‌దివి, శ‌స్త్ర‌చికిత్స‌కు ఏర్పాట్లు చేసుకున్నాం` అని రాకేశ్ కైన్ అన్నారు.

More Telugu News