infosys: నందన్ నిలేకని మొగ్గు ఎవరివైపో... ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ ఎంపిక నేడే!

  • రేసులో బీజీ శ్రీనివాస్, వేమూరి అశోక్
  • శ్రీనివాస్ కు చాన్స్ లు అధికం
  • నేడు మనసులో మాట చెప్పనున్న నందన్
  • స్టాక్ మార్కెట్లో ఇన్ఫీ ఈక్విటీ జోరు

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరన్న విషయం నేడు బహిర్గతం కానుంది. ఈ సంవత్సరం ఆగస్టులో సంస్థ సీఈఓ ఎంపిక బాధ్యతలను భుజాన వేసుకున్న సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకని, నేడు తాను ఎంపిక చేసిన వ్యక్తి పేరును వెల్లడించనున్నారు. ఈ పోస్టుకు మాజీ ఎగ్జిక్యూటివ్ లు బీజీ శ్రీనివాస్, వేమూరి అశోక్ లు గట్టి పోటీ పడుతున్నారని, వీరిద్దరిలో ఒకరికి తదుపరి ఇన్ఫీ బాధ్యతలు దక్కుతాయని తెలుస్తోంది.

ఇక వీరిద్దరూ 2014లో విశాల్ సిక్కాను సీఈఓగా నారాయణమూర్తి ఎంపిక చేయకముందు ఇన్ఫోసిస్ కు రాజీనామా చేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇన్ఫీ అభివృద్ధిలో వీరిద్దరికీ భాగముంది. ప్రస్తుతం శ్రీనివాస్ పీసీసీడబ్ల్యూ గ్రూప్ ఆఫ్ హాంకాంగ్ ఎండీగా ఉన్నారు. ఇన్ఫోసిస్ లో గ్లోబల్ మార్కెట్స్ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. శ్రీనివాస్ కే ఇన్ఫీ సీఈఓగా అధిక అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా నేటి సాయంత్రంలోగా నందన్ నిలేకని తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని సమాచారం. ఇక ఇన్ఫీకి కొత్త చీఫ్ రానున్నారన్న వార్తలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచాయి. ఈ ఉదయం 10.40 గంటల సమయంలో ఇన్ఫీ ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 0.32 శాతం పెరిగి రూ. 942 వద్ద కొనసాగుతోంది.

More Telugu News