Hollywood: హాలీవుడ్ లో మరో కలకలం... ఆ దర్శకుడు వేధించాడంటూ 38 మంది మహిళల ఫిర్యాదు

  • నిర్మాత హార్వే వీన్ స్టీన్ వివాదం సద్దుమణగకముందే హాలీవుడ్ లో మరో లైంగిక వేధింపుల వివాదం
  • జేమ్స్‌ టొబాక్‌ తమను వివిధ సందర్భాల్లో వేధించాడన్న 38 మంది మహిళలు
  • స్టార్ హోదా వచ్చేలా చేస్తానని వేధింపులకు దిగాడన్న మహిళలు

హాలీవుడ్‌ లో మరో కలకలం రేగింది. నిర్మాత హార్వే వీన్‌ స్టీన్‌ లైంగిక వేధింపుల వ్యవహారం పూర్తిగా సద్దుమణగకముందే మరో లైంగిక వేధింపుల పర్వం వెలుగు చూసింది. దాని వివరాల్లోకి వెళ్తే... ‘బగ్సీ’ చిత్రానికి ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే విభాగంలో ఆస్కార్‌ అవార్డు (1991) కు నామినేట్‌ అయిన అమెరికా దర్శకుడు జేమ్స్‌ టొబాక్‌ (72) తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 38 మంది మహిళలు ఆరోపించారు. ‘లాస్‌ ఏంజిలెస్‌ టైమ్స్‌’ వార్తాసంస్థకు వారు ఈ విషయాలు వెల్లడించారు. వీరంతా గతంలో అతనిపై ఎలాంటి కేసులు నమోదు చేయని వారు కావడం విశేషం.

 పనిలోకి తీసుకున్న మహిళలు, పనికోసం వెతుకుతున్న స్త్రీలు, వీధుల్లో తారసపడ్డ మహిళలపై టొబాక్‌ లైంగిక వేధింపులకు దిగేవాడని వార్తా సంస్థ తెలిపింది. వీరిలో కొందరికి స్టార్ హోదా వచ్చేలా చేస్తానని కూడా వాగ్దానం చేసినట్టు వారు తెలిపారు. వారిని కలిసినప్పుడు తనకు ప్రముఖులతో లైంగిక సంబంధాలు ఉన్నాయని టొబాక్‌ ప్రగల్భాలు పలికేవాడని వారు వెల్లడించారు. ఆ సమయంలో తమను అవమానకర రీతిలో ప్రశ్నలు అడిగే వాడని వారు ఆరోపించారు. కాగా, దీనిపై టొబాక్ స్పందించారు. వారెవరో తనకు తెలియదని అన్నారు. వారిని తానెప్పుడూ కలవలేదని ఆయన ప్రకటించారు. 

More Telugu News