ys jagan: జగన్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేయడంపై అంబటి రాంబాబు స్పందన

  • వారంలో ఒక రోజు కోర్టుకు వెళ్లడానికి జగన్ కు ఇబ్బంది లేదు
  • కోర్టు తీర్పును గౌరవిస్తాం
  • పాదయాత్ర సమయం మరో నెల పెరిగే అవకాశం

పాదయాత్ర నేపథ్యంలో అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలంటూ వైసీపీ అధినేత జగన్ వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. ప్రతి శుక్రవారం యథావిధిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో, వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని చెప్పారు.

వారంలోని మిగిలిన రోజుల్లో పాదయాత్ర కొనసాగుతుందని... శుక్రవారం నాడు కోర్టుకు జగన్ హాజరవుతారని చెప్పారు. కోర్టు విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో పాదయాత్ర ఎక్కడైతో ఆగుతుందో... విచారణ అనంతరం, మరుసటి రోజున సరిగ్గా అదే ప్రాంతం నుంచి కొనసాగుతుందని తెలిపారు.

ప్రతివారం కోర్టుకు హాజరుకావాల్సిన నేపథ్యంలో, వారంలో ఒక రోజు పాదయాత్రకు బ్రేక్ పడుతుందని... దీంతో, అనుకున్న కాల వ్యవధికంటే మరిన్ని ఎక్కువ రోజులు పాదయాత్రకు పట్టే అవకాశం ఉందని చెప్పారు. ఆరు నెలల పాదయాత్ర ఏడు నెలలు కొనసాగే అవకాశం ఉందని అన్నారు. పై కోర్టుకు వెళ్లాలా? వద్దా? అనే విషయంపై జగన్, ఇతర కీలక నేతలు కలసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వారంలో ఒక రోజు కోర్టుకు హాజరవడానికి జగన్ కు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.

More Telugu News