kerala: చెల్లెలిని అబ్బాయిల పక్కన కూర్చోబెట్టి శిక్షించిన టీచర్... అవమానం తట్టుకోలేక అక్క ఆత్మహత్య!

  • కేరళలో కలకలం రేపిన ఘటన
  • క్లాసులో మాట్లాడిందని హేయమైన శిక్ష విధించిన టీచర్
  • చెల్లిని అబ్బాయిల పక్కన కూర్చోబెట్టగా వాదించిన అక్క
  • ఆపై సహ విద్యార్థులు హేళన చేస్తుంటే ఆత్మహత్య

ఓ బాలిక తప్పు చేసిందని ఆరోపిస్తూ, అబ్బాయిల పక్కన కూర్చోవాలని ఓ టీచర్ శిక్ష విధించగా, ఆ అవమానాన్ని తట్టుకోలేక బాధితురాలి అక్క పాఠశాల భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో కలకలం సృష్టించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ట్రినిటీ లైసియమ్ స్కూల్ లో 15 సంవత్సరాల బాలిక 10వ తరగతి, ఆమె సోదరి 13 ఏళ్ల బాలిక ఎనిమిదో తరగతి చదువుతున్నారు.

తన సోదరి క్లాసులో మాట్లాడుతోందని ఆరోపిస్తూ, అబ్బాయిల పక్కన కూర్చోబెట్టిన టీచర్ తో సదరు బాలిక గొడవ పెట్టుకుంది. ఇలా చేయడం భావ్యం కాదని వాదించింది. ఆపై వారి తల్లి కూడా స్కూలుకు వచ్చి నిలదీయగా, మరోసారి ఇలా జరగకుండా చూస్తామని పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చింది.

ఆపై సమస్య మరోరూపంలో ఎదురైంది. టీచర్ తో వాదించిన బాలికను కొందరు విద్యార్థినీ విద్యార్థులు హేళన చేశారు. మొత్తం ఘటనలను అవమానంగా భావించిన ఆమె ఆవేశంలో మూడో అంతస్తు నుంచి దూకింది. ఆ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా, ప్రాణాలను కాపాడలేకపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు టీచర్లను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.

More Telugu News