railway: రైల్లో ఏసీ టికెట్ క‌న్ఫ‌ర్మ్ కాక‌పోతే విమానంలో గ‌మ్య‌స్థానానికి?

  • యోచిస్తోన్న రైల్వే శాఖ‌
  • ఎయిరిండియాకు ప్ర‌తిపాద‌న‌లు పంపిన రైల్వే బోర్డు చైర్మ‌న్‌
  • ఇప్పుడే చెప్ప‌లేమ‌న్న ఎయిరిండియా చైర్మ‌న్

ఏసీ టికెట్ బుక్ చేసుకుని, క‌న్ఫ‌ర్మ్ కాని ప్రయాణికుల ప్ర‌యోజ‌నం కోసం భార‌తీయ రైల్వే ఓ కొత్త ఆఫ‌ర్ ప్ర‌వేశ‌పెట్టే యోచ‌న‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏసీ-1, ఏసీ -2 వెయిటింగ్ లిస్టులో ఉండి, టికెట్ కన్ఫ‌ర్మ్ కాకపోతే ఎలాంటి అధిక చార్జీలు వసూలు చేయకుండా ప్రయాణికులను విమానంలో గ‌మ్య‌స్థానాల‌కు పంపించే సదుపాయాన్ని క‌ల్పించాలని యోచిస్తున్నట్లు రైల్వేబోర్డు ఛైర్మన్ అశ్వనీ లోహాని వెల్లడించారు. రాజధాని రైళ్లలో ప్రయాణికుల రద్దీ కార‌ణంగా ఏసీ -2 టికెట్లు క‌న్ఫ‌ర్మ్ కావ‌డం లేద‌ని చాలా మంది ఫిర్యాదు చేయడంతో ఈ ఆలోచ‌న చేసిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విమానాల్లో పంపించ‌డం ద్వారా ఎయిరిండియాకు ఆక్యుపెన్సీని పెంచేలా చూస్తామని అశ్వనీ పేర్కొన్నారు.

వెయిటింగ్ లిస్టులో ఉండి, టికెట్ క‌న్ఫ‌ర్మ్ కాని రాజధాని ఏసీ టికెట్ ఉన్న ప్రయాణికుల వివరాల‌ను ఎయిరిండియాకు పంపించి, ఎలాంటి అధిక ఛార్జీలు వ‌సూలు చేయ‌కుండా వారిని గ‌మ్య‌స్థానాల‌కు చేర‌వేసే ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. దీనికి సంబంధించిన‌ ప్రతిపాదనను ఎయిరిండియాకు పంపిన‌ట్లు అశ్వ‌నీ లోహాని తెలిపారు. అయితే ఈ ప్రతిపాదన మీద‌ తాను ఇప్పుడే ఏం చెప్ప‌లేన‌ని, రైల్వేకు, విమాన చార్జీలకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్న కార‌ణంగా కొంత ఆలోచించాల్సి ఉందని ఎయిర్ ఇండియా ఛైర్మన్ రాజీవ్ బన్సాల్ చెప్పారు.

More Telugu News